👉 ప్రజాస్వామ్య పరిరక్షణలో మహిళా పాత్రికేయులది కీలక పాత్ర..!
👉 మహిళల హక్కులు, భద్రత, సమాన అవకాశాలపై గళమెత్తిన ప్రముఖులు..!
👉 నిర్భయంగా నాయకత్వం వహించాలి.. మహిళా జర్నలిస్టులకు ఐపీఎస్ సుమతి పిలుపు..!
👉 హైదరాబాద్లో మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో….
J.SURENDER KUMAR,
☝️భయపెట్టినా వెనక్కి తగ్గని కలం… బెదిరించినా ఆగని ప్రశ్న.. ..అడ్డంకులు ఎదురైనా నిజాన్ని ప్రజల ముందుంచే ధైర్యం… ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఈ విలువలను కాపాడటంలో మహిళా జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు.
☝️ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరని రాష్ట్ర మంత్రి సీతక్క ఉద్ఘాటించగా, నిజాలను నిగ్గుతేల్చడమే జర్నలిజం కర్తవ్యమని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి పేర్కొన్నారు.
☝️మహిళలు నిర్భయంగా నాయకత్వం వహించాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి పిలుపునిచ్చారు.
మహిళా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫీ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు ఈ కీలక సందేశాలకు వేదికైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు హాజరై తమ వృత్తిపరమైన సమస్యలు, హక్కులు, భద్రత, భవిష్యత్ సవాళ్లపై చర్చకు శ్రీకారం చుట్టారు.
👉 ప్రశ్నించే హక్కు ఎవరి భిక్ష కాదు మంత్రి సీతక్క స్పష్టమైన సందేశం..!

రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, మహిళలు భయంతో తమ గొంతును తామే నొక్కేసుకోకూడదని స్పష్టం చేశారు. చేతిలో మైక్ పట్టుకున్న మహిళ శత్రువు కాదని, సమాజ హితం కోసం ప్రశ్నించే పాత్రికేయులు వ్యవస్థకు ముప్పు కారని పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మహిళల ప్రగతిని బట్టి సమాజ ప్రగతిని అంచనా వేయవచ్చని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, మహిళలు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసమే పోరాడుతున్నారని, ఎవరి దయాదాక్షిణ్యాలనూ కోరడం లేదని అన్నారు.
విధి నిర్వహణలో మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, వ్యక్తిత్వ హననం వంటి చర్యలను ఖండించారు. వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు మహిళా జర్నలిస్టులంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.
👉 నిజాన్ని వెలికితీయడమే జర్నలిజం ప్రాణం జస్టిస్ జి. రాధారాణి..!

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు జస్టిస్ జి. రాధారాణి మాట్లాడుతూ, స్వతంత్ర పత్రికారంగం లేకుండా ప్రజాస్వామ్య మనుగడ సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వమే జర్నలిజానికి ప్రాణవాయువని, నిష్పాక్షికంగా వాస్తవాలను ప్రజల ముందుంచడమే పాత్రికేయుల ప్రధాన కర్తవ్యమని వివరించారు.
రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తుందని, అధికరణ 19(2) దానికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన పరిమితులను నిర్దేశిస్తుందని గుర్తుచేశారు.

డిజిటల్ మాధ్యమాలు విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో అసత్య ప్రచారాలు, డీప్ఫేక్లు, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల వార్తల విశ్వసనీయతకు సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. అందువల్ల ప్రతి వార్తలో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అదే సమయంలో మీడియా సంస్థల్లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక (పోష్) చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, మహిళా జర్నలిస్టులకు సురక్షితమైన పని వాతావరణం, సమాన వృత్తిపరమైన అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
👉 డెస్క్కే పరిమితం కావొద్దు నాయకత్వం వహించండి..
ఐపీఎస్ సుమతి పిలుపు..!

మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి మాట్లాడుతూ, మహిళలు సమస్యలను సమగ్రంగా విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉంటారని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు కేవలం డెస్క్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి రిపోర్టింగ్లోనూ ముందుండాలని సూచించారు.
వృత్తిలో అనేక అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ నిర్భయంగా నాయకత్వం వహించాలని, ప్రజాస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు వివిధ రంగాల్లో రాణించడానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరమని వివరించారు.
👉 మానవీయ కథనాలే సమాజానికి అద్దం ఆయేషా ఖానమ్..!

కర్ణాటక మీడియా అకాడమీ చైర్పర్సన్ ఆయేషా ఖానమ్ మాట్లాడుతూ, న్యూస్రూమ్లలో మహిళా జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలను మానవీయ కోణంలో అర్థం చేసుకుని, ప్రజల జీవితాలను ప్రతిబింబించే కథనాలను అందించాలని సూచించారు.

అంతకుముందు ఐజేయూ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ ప్రారంభోపన్యాసం చేస్తూ, క్షేత్రస్థాయిలో మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను వివరించారు. ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ అంశాలపై జర్నలిస్టులు నిర్భయంగా కథనాలు వెలువరించిన సందర్భాలను ప్రస్తావించారు.
👉 జాతీయ స్థాయి నేతల హాజరు…

ఈ ప్రారంభ సభకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, కర్ణాటక మీడియా అకాడమీ చైర్పర్సన్ ఆయేషా ఖానమ్, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి. అమర్, ఎస్.ఎన్. సిన్హా, ఐజేయూ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ తదితరులు హాజరయ్యారు.

సీనియర్ జర్నలిస్టులు స్వప్న, టీయూడబ్ల్యూజే మహిళా విభాగం కన్వీనర్ రాజేశ్వరి కళ్యాణం, అత్తలూరి అరుణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సులో వృత్తిలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, వేధింపులు, బెదిరింపులు, భద్రతా సమస్యలపై చర్చించడంతో పాటు, సమాన అవకాశాలు మరియు స్వేచ్ఛాయుతమైన పాత్రికేయ వాతావరణం కోసం వేదికలో సమష్టిగా మొదటి రోజు చర్చ జరిగింది.
