ఆడపిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలి !

👉 ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

ఆడపిల్లలు ఉన్నతస్థానంలో నిలదొక్కుకోవాలంటే తప్పనిసరిగా చదువుకోవాలని, తమ పిల్లలను చదివిస్తామని మహిళలంతా మాట ఇవ్వాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కోరారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు.

👉 దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత, గీత కార్మికులకు కొత్తగా 4.5 లక్షల పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి  లాంఛనంగా ప్రారంభించారు.

👉 దీపావళి పండుగతో పాటు పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి  కొడంగల్ నియోజకవర్గంలో హకీంపేట్ ఇండస్ట్రియల్ హబ్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 ఈ శుభ సందర్భంగా పలువురు మహిళలకు పింఛన్లు అందించి, రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత, గీత కార్మికులకు సంతృప్త స్థాయిలో అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ..

“ఆడబిడ్డల ఆనందంలో తోడుగా ఉండాలని, ఒక సోదరుడిగా మీకు సేవ చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించారు. ఆడబిడ్డల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తా. ఈరోజు నా పుట్టిన రోజును మహిళా శక్తికి అంకితం చేస్తున్నా. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే నా జన్మ ధన్యమైనట్టే. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెడితే రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టినట్టే..” అని పేర్కొన్నారు.

👉 “మీరే నా కుటుంబం. మీరే నా ఆత్మబంధువులు. మహిళలు ఉక్కు సంకల్పంతో ఆశీర్వదించారు కాబట్టే నాకు తెలంగాణ ముఖ్యమంత్రి హోదా, గౌరవం దక్కింది. నా సర్వశక్తులు ధారపోసి ప్రతి నిమిషం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంగా కార్యాచరణ తీసుకుని ముందుకు నడుస్తానని మాట ఇస్తున్నా” అని అన్నారు.

👉 ప్రస్తుతం రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని పేర్కొంటూ, 2034 నాటికి ఆ సంఖ్యను కోటికి పెంచడమే కాకుండా వారందరినీ కోటీశ్వరులను చేయాలన్నదే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు.

👉 ఆడబిడ్డ నిలబడితే కుటుంబం నిలబడుతుందని, అందుకే ప్రభుత్వం ప్రతి పథకం మహిళల పేరుతోనే అందజేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 25.5 లక్షల మంది పిల్లలకు రెండు జతల చొప్పున స్కూల్ డ్రెస్సులను కుట్టే పనులను మహిళలకు శిక్షణ ఇచ్చి, ఆ పనులను అప్పగించామని గుర్తుచేశారు.

👉 మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పించామని, సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామని చెప్పారు.

👉 గడిచిన 34 నెలల కాలంలో మహిళా సంఘాలకు ₹. 79 వేల కోట్ల రుణాలపై బ్యాంకు లింకేజీ ఇచ్చామని, ఆ రుణాలపై ప్రభుత్వం ₹ 1,900 కోట్ల మేర వడ్డీ చెల్లించిందని తెలిపారు.

👉 రాష్ట్రంలో మంజూరు చేసిన 8.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కూడా ఆడబిడ్డల పేరుతోనే అందజేశామని, రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఇలా ఏ పథకమైనా ఆడబిడ్డల పేరిటే ఇచ్చామని గుర్తుచేశారు.

👉 ఆడబిడ్డలు ప్రయాణ చార్జీలు నెలకు ₹ 8 నుంచి ₹ 10 వేల మేరకు ఆదా చేసుకోవాలన్న ఉద్దేశంతో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు మహిళలు 37 లక్షల ప్రయాణాలు ఉచితంగా చేయగా అందుకు ప్రభుత్వం ఆర్టీసీకి ₹13 వేల కోట్లు చెల్లించామని చెప్పారు.

👉 గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల కోసం ఇన్ని పథకాలు అమలు చేయలేదన్నారు. నా అభివృద్ధికి చేయూతనిచ్చిన మీ అందరి మధ్యన పుట్టిన రోజు జరుపుకోవాలని ఇక్కడకు వచ్చానని అన్నారు. ఈ ప్రభుత్వం మీది. మీకోసమే ఆలోచన చేస్తుందన్నారు.

👉 నవంబర్ 19న ఇందిరా గాంధీ  జయంతి రోజున కోటి మంది ఆడబిడ్డలకు సారెగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నామని తెలిపారు.

👉 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం బలోపేతం కావాలంటే మహిళలు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి  అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , ధనసరి అనసూయ సీతక్క , జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి , ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , మల్లు రవి తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.