బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం!

👉 మద్దిమడుగులో ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన…!

👉 బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి సముచిత గౌరవం…!

👉 ఆలయ ప్రాంగణం, ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

J.SURENDER KUMAR,

బంజారా సమాజ ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహరాజ్‌కు సముచిత గౌరవం కల్పిస్తూ, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్దిమడుగులో ఆయన పేరిట మహత్తర ఆలయాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  వెల్లడించారు.

ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

మద్దిమడుగులో నిర్మించనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రాంగణాన్ని సోమవారం స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, గిరిజన ఎమ్మెల్యే బాలు నాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించి, పలు సూచనలు చేశారు. సంత్ సేవాలాల్ మహరాజ్‌కు ఘనమైన నివాళి..!

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ……

సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శి మాత్రమే కాకుండా, సమాజంలో ఐక్యత, సద్భావన, నైతిక విలువలు, సేవాభావాన్ని పెంపొందించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు, జీవన సందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.

👉 మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణం చేపట్టడం బంజారా సమాజ ఆధ్యాత్మిక ఆకాంక్షలకు గౌరవం ఇవ్వడమే కాకుండా, వారి విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించే గొప్ప అవకాశమని మంత్రి అభిప్రాయపడ్డారు.

👉సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, గిరిజన సమాజాలు అభివృద్ధిలో సమాన భాగస్వాములు కావాలన్నదే ప్రజాస్వామ్య పాలనలో ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల భూమి, సంస్కృతి, సంప్రదాయాలు, విద్య, ఉపాధి, సామాజిక గౌరవం వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలని తెలిపారు.

👉మహనీయుల చరిత్రను, గిరిజన సమాజాల పోరాటాలను, వారి సాంస్కృతిక వైభవాన్ని గుర్తించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణం ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు.

👉గతంలో గొప్ప మహనీయురాలు ఉక్కు మహిళా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1976లో పార్లమెంట్ ఆమోదించిన ఎస్సీ, ఎస్టీ జాబితాల సవరణ చట్టం ద్వారా అప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సుగాలీలు, లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చే చట్టపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం 1977లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల సామాజిక గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కుల చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా అభివర్ణించారు.


  👉 రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్రలో గిరిజనులు, రైతులు, యువతతో మమేకమై వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గిరిజనుల హక్కులు, భూమి పరిరక్షణ, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయని ఇలాంటి గొప్ప అంశాల పై కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలు, తెగలపై ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ గిరిజనుల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు వారి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.

👉 భక్తులకు సాదర ఆహ్వానం..!

ఈ నెల 26న మద్దిమడుగులో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బంజారా సోదరులు, గిరిజన ప్రజాప్రతినిధులు, భక్తులు, సేవాలాల్ మహరాజ్ అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పిలుపునిచ్చారు. అంతకు ముందు మంత్రి మద్దిమడుగు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగాలని ప్రార్థించారు.