👉 సంక్రాంతి తర్వాత 5 నెలల పాటు ప్రజాబలం.!.
👉 ఓబీసీ కులగణనకు తీర్మానం.. ఎల్‌నినో ఎదుర్కొనేందుకు కేంద్రానికి ₹ 30 వేల కోట్ల సాయం డిమాండ్.!
👉 పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం.!
J . SURENDER KUMAR,
వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ కార్యాచరణకు పదును పెడుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలు, కోటి ఓట్ల లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నూతన ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి బీఎం సందీప్ కుమార్ పాల్గొన్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), పీసీసీ సలహా కమిటీ, విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రయోజనాలు, ఎన్నికల వ్యూహాలు, ఓటు హక్కు పరిరక్షణ వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
👉 5 నెలల పాటు ప్రజాబలం కార్యక్రమం.!
సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో కొత్త కార్యక్రమాన్ని చేపడతామని, నిధుల కొరత లేకుండా చూస్తామని వెల్లడించారు.
👉మంచిని మైక్‌లో.. చెడును చెవిలో చెప్పాలి..!
పార్టీలో అంతర్గత విభేదాలు, బహిరంగ విమర్శలకు తావులేకుండా నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. మంచిని మైక్‌లో చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలన్న ఆయన వ్యాఖ్య పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలను వంద శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన కార్యకర్తలను గుర్తించి ఇప్పటికే అనేక మందికి పదవులు కల్పించామని తెలిపారు.
👉 కొత్త ఇన్ఛార్జికి స్వాగతం.. మీనాక్షికి కృతజ్ఞతలు..!

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బీఎం సందీప్ కుమార్‌కు సీఎం స్వాగతం పలికారు. ఆయన నియామకానికి కృషి చేసిన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన మీనాక్షి నటరాజన్ హయాంలో ఉపఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయాలు సాధించినట్లు పేర్కొంటూ ఆమె సేవలను అభినందించారు.
👉2027 జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలి..!
సామాజిక న్యాయం దిశగా మరో కీలక అంశాన్ని సీఎం సమావేశం ముందుంచారు. వందేళ్ల తర్వాత తొలిసారిగా తెలంగాణలో ఓబీసీ కులగణన నిర్వహించామని పేర్కొన్నారు. 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో ఓబీసీ కులగణనను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఏసీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు సూచించారు.
👉ఎల్‌నినో ముప్పు.. కేంద్రం ₹ 30 వేల కోట్లు ఇవ్వాలి.!
రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉండటంతో రాష్ట్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ కరవు పరిస్థితులు ఉన్నాయని వివరించారు. రైతులు తక్కువ నీటితో పండే ఈపంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు కొరత లేదని, వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడగలిగామని తెలిపారు. రాబోయే ఎనిమిది నెలల పాటు ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వానికి కీలక సవాలుగా మారనుందని చెప్పారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణకు రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అవసరమని, కేంద్రం ఈ నిధులు అందించాలని కోరుతూ పీఏసీలో తీర్మానం చేయాలని సూచించారు.
👉ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం..!
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ ఆలోచనల ఫలితంగానే దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని, ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని, తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓటు హక్కుకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులు ఇప్పటి నుంచే ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, అర్హులైన ఒక్క ఓటరుకు కూడా అన్యాయం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.
👉 బీఆర్ఎస్పై విమర్శలు.. ప్రాజెక్టులపై వివరణ..!
ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో 299 టీఎంసీల నీటి వినియోగానికి సంతకం చేయడం వల్లే ఏపీలో ప్రాజెక్టులకు మార్గం సుగమమైందని ఆరోపించారు. పల్నాడు వాటర్ గ్రిడ్, జల్ జీవన్ మిషన్ జీవోలు, పోతిరెడ్డిపాడు అంశాలు 2022లోనే ప్రారంభమయ్యాయని, భూసేకరణకు సైతం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని స్పష్టం చేశారు.
👉 26న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీ..!
ఈ నెల 26న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి బీఎం సందీప్ కుమార్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
👉ఎన్నికల లక్ష్యం ఒక్కటే కాదు.. ప్రజలతో నిరంతర అనుబంధం!
అధికారం కోసం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వెళ్లడం కాకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే రాజకీయ పార్టీలకు నిజమైన ప్రజాభిమానం లభిస్తుంది. ప్రజాబలం కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
