దశాబ్దాల కొండగట్టు అంజన్న పవిత్ర చందనం..!

👉 కొండగట్టు అంజన్న చందనోత్సవంలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం…!

👉 40 రోజులపాటు  భక్తులకు శ్రీ స్వామివారి నిజరూప దర్శనం !

👉 తొలగించిన చందనం తూకం వేస్తే 99 కిలోల 720 గ్రాములు..!

👉 శాస్త్రోక్తంగా తొలగింపు.. పంచనామా నిర్వహించి భద్రత మధ్య సీల్ చేసిన అధికారులు…!


J.SURENDER KUMAR,


ఆరు దశాబ్దాలుగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి మూలవిరాట్‌ను అలంకరించిన పవిత్ర చందనం.. తరతరాల భక్తుల విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచిన ఆధ్యాత్మిక సంపద.. 60 సంవత్సరాల తర్వాత నిర్వహించిన చందనోత్సవంలో స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించగా దాని బరువు అక్షరాలా 99 కిలోల 720 గ్రాములు..

కొండగట్టు అంజన్న దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి చందనోత్సవాల్లో భాగంగా బుధవారం ఈ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. స్వామివారి మూలవిరాట్‌కు అలంకరించిన చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించిన అనంతరం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో తూకం వేశారు. ఈ సందర్భంగా 99 కిలోల 720 గ్రాముల చందనం ఉన్నట్లు నిర్ధారణ అయింది.

పంచనామ నిర్వహించి సీల్ చేసి భద్రపరుస్తున్న చందనం(ఫైల్ ఫోటో)

అనంతరం తొలగించిన చందనానికి పంచనామా నిర్వహించి, తగిన భద్రతా చర్యలు చేపట్టి సీల్ వేసి భద్రపరిచారు. మొత్తం ప్రక్రియను దేవస్థానం అధికారులు, అర్చకుల సమక్షంలో నిర్వహించారు.

👉 భక్తుల విశ్వాసానికి పవిత్ర ప్రతీక !

స్వామివారికి అర్చకులు, భక్తులు భక్తిశ్రద్ధలతో చందనం పూయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అలా దశాబ్దాలుగా మూలవిరాట్‌కు అంటుకొని ఉన్న చందనాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు కొండగట్టు అంజన్న అంటే అపారమైన భక్తి, నమ్మకం. అందుకే ఆరు దశాబ్దాల చందనోత్సవం వారికి మరచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తోంది.

ఆరు దశాబ్దాల కాలానికి సాక్ష్యంగా నిలిచిన 99 కిలోల 720 గ్రాముల చందనం.. కొండగట్టు అంజన్నపై భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఒక అరుదైన ఆధ్యాత్మిక గుర్తుగా నిలిచిపోనుంది. కాలం గడిచినా భక్తి తరగదు.. తరాలు మారినా అంజన్నపై విశ్వాసం చెక్కుచెదరదు నడానికి ప్రత్యక్ష నిదర్శనం.

👉 40 రోజులపాటు  భక్తులకు శ్రీ స్వామివారి నిజరూప దర్శనం !


60 సంవత్సరాల అనంతరం. నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి చందనోత్సవం మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 15  నుండి ప్రారంభమై 20.11.2026 ముగియనున్నది 21.11.2026 నుంచి 29.12.2026 వరకు 40 రోజులపాటు  భక్తులకు శ్రీ స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పించబడనున్నది.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి, ప్రధానార్చకులు జితేంద్ర ప్రసాద్, చిరంజీవ స్వామి, మారుతీ ప్రసాద్, స్థానాచార్యులు కపిందర్, సహాయ కార్యనిర్వహణాధికారి హరిహరనాథ్, పర్యవేక్షకులు సునీల్ కుమార్, పరిశీలకులు అశోక్, లక్ష్మారెడ్డి, ఏఎస్ఐ రామయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.