దివ్యాంగులకు సమాన అవకాశాలు కావాలి !

👉 సుగమ్య భారత్‌ను జాతీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి !

👉 ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేక నోడల్ అధికారులు, అందుబాటు సౌకర్యాలకు ప్రత్యేక బడ్జెట్ అవసరం !

👉 న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సమక్షంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక సూచనలు!

J.SURENDER KUMAR,

దివ్యాంగులు ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవిస్తూ సమాజంలోని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందేలా అడ్డంకులు లేని వాతావరణాన్ని కల్పించడమే వికసిత భారత్ లక్ష్యం కావాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూ లు కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ ల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. సుగమ్య భారత్ అభియాన్‌ను కేవలం మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమంగా కాకుండా దివ్యాంగుల హక్కులు, ఆత్మగౌరవం, స్వావలంబనకు భరోసా కల్పించే జాతీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి శాఖాపరమైన సదస్సులో బుధవారం ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రం తరఫున మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని సుగమ్య భారత్ – వికసిత భారత్ అంశంపై రాష్ట్ర అనుభవాలు, క్షేత్రస్థాయి సవాళ్లు, అమలుకు సాధ్యమైన కార్యాచరణ ప్రతిపాదనలను వివరించారు. వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. …

వికసిత భారత్–2047 లక్ష్య సాధనలో దివ్యాంగుల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మెట్రో నగరాలు, విమానాశ్రయాలు, ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అందుబాటు సౌకర్యాలు కల్పించాలని కోరారు.

👉 ప్రభుత్వ భవనాలతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రజా రవాణా వ్యవస్థల్లో ర్యాంపులు, లిఫ్టులు, స్పర్శ ఆధారిత మార్గాలు, ప్రత్యేక మరుగుదొడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. సదుపాయాలు ఏర్పాటు చేసిన సౌకర్యాలు నిరంతరం వినియోగంలో ఉండేలా నిర్వహణ, పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

👉 ప్రతి శాఖలో నోడల్ అధికారి.. ప్రత్యేక బడ్జెట్..!

ప్రతి ప్రభుత్వ శాఖలో అందుబాటు సౌకర్యాల కల్పన, నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని మంత్రి ప్రతిపాదించారు. ఆయా శాఖలు తమ వార్షిక బడ్జెట్‌లో ఈ సౌకర్యాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, నిర్దిష్ట గడువుతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భవనాల తనిఖీల్లో దివ్యాంగుల సంఘాలు, సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు.

👉 దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016 నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని, కొత్త భవనాల నిర్మాణ అనుమతుల సమయంలోనే నిర్దేశిత అందుబాటు ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు దృష్టి, వినికిడి లోపాలు కలిగినవారికి కూడా సులభంగా అందుబాటులో ఉండేలా సాంకేతిక మార్పులు చేపట్టాలని సూచించారు. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సిబ్బందికి అందరికీ అందుబాటులో ఉండే నిర్మాణ విధానాలు, దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు.

👉 జాతీయ డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి!

దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటు సౌకర్యాల స్థితిని పర్యవేక్షించేందుకు సమగ్ర జాతీయ డిజిటల్ వేదికను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.


👉 ప్రతి శాఖ తన పరిధిలోని భవనాల వివరాలు, సౌకర్యాల స్థితి, పనుల పురోగతిని ఫొటోలతో సహా నమోదు చేయాలని ప్రతిపాదించారు.దివ్యాంగులు తమ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించే వ్యవస్థను తీసుకురావాలని కోరారు.


👉 ప్రైవేటు రంగంలోని ఆసుపత్రులు, హోటళ్లు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు కూడా దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించేలా ప్రోత్సహించాలని, ఉపాధి అవకాశాలను విస్తరించాలని సూచించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకుంటూ ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు
.

👉 దివ్యాంగులకు కల్పించే సౌకర్యాలు వయోవృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు, తాత్కాలికంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయని మంత్రి వివరించారు.

👉 తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు సహా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు కట్టుబడి ఉందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించే విధానాలు, మార్గదర్శకాల అమలుకు సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.


👉“దివ్యాంగులకు ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేయడమే సుగమ్య భారత్ కాదు.. వారు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించడమే నిజమైన సుగమ్య భారత్. దివ్యాంగుల భాగస్వామ్యం, సాధికారతతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. అదే వికసిత భారత్–2047కు పునాది కావాలి” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.