ఎస్సీ ఎస్టీల సంక్షేమమే మా ప్రాధాన్యత!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చెప్పారు.

👉 ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ముఖ్యమంత్రి గారితో షెడ్యూల్డు కులాలు, తెగల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి  వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు.

👉 శాసనసభ స్పీకర్‌గా, మంత్రులుగా దళితులకు రాజకీయంగా సముచిత అవకాశం కల్పించామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ కార్పొరేషన్లలో అనేక అవకాశాలు కల్పించిన విషయాలను ప్రస్తావించారు.

👉 వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దళితుడికి అవకాశం కల్పించామని, ఉస్మానియాతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఐఐఐటీలలో ఎస్సీ, ఎస్టీలకు వీసీలుగా అవకాశాలు ఇచ్చామని వివరించారు. అర్హత, అవకాశం ఉన్న ప్రతి చోట ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించామని గుర్తుచేశారు.

👉 రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలోనూ వారినే ప్రాధాన్యతగా తీసుకున్నామని వివరించారు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి  తెలిపారు.

👉 దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. వర్గీకరణ అమలు చేయడం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ని కమిటీ సభ్యులు అభినందించారు.

👉 ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు రవి , తాపీర్ గావ్ , హరీశ్ చంద్ర మీనా , అనిల్ ఫిరోజియా , అరుణ్ కుమార్, దగ్గుమల్ల ప్రసాద రావు తో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , పలువురు శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.