👉 పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలి..!
👉 దివ్యాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు..!
👉 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశం..!
👉 దివ్యాంగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చర్చలు.!
J.SURENDER KUMAR,
దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. సమస్యలను అధిగమించేందుకు దివ్యాంగులు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన అంశాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిస్తుందని భరోసా ఇచ్చారు.
👉 డిసెంబర్ 3న నిర్వహించనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా, అర్థవంతంగా నిర్వహించేందుకు శనివారం బంజారా భవన్లో వివిధ దివ్యాంగుల ఉద్యమ, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, హక్కులు, సాధికారతకు సంబంధించి చేపట్టాల్సిన చ9ర్యలపై ప్రతినిధులతో చర్చించారు.
దివ్యాంగుల శాఖ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……

దివ్యాంగుల సమస్యలను కేవలం వినడమే కాకుండా, వాటి పరిష్కారానికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, పింఛన్లు, వైద్య సదుపాయాలు, సహాయ పరికరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో సౌకర్యాలు వంటి అంశాల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు.
👉 ఈ సందర్భంగా పలు సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు . ఆయా వసమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ప్రతిపాదనలను అధికారులను ఆదేశించారు.
👉 దివ్యాంగుల సంక్షేమం అనేది కేవలం సంక్షేమ పథకాల అమలుకే పరిమితం కాకూడదని, సమాజంలో వారికి సమాన అవకాశాలు, గౌరవం, స్వావలంబన కల్పించడమే నిజమైన సాధికారత అని మంత్రి పేర్కొన్నారు.
👉 దివ్యాంగుల్లో అపారమైన ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే వారు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపైనా ఉందన్నారు.
👉 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమం కేవలం వేడుకగా కాకుండా, దివ్యాంగుల సమస్యలు, హక్కులు, విజయాలు, ప్రభుత్వ బాధ్యతలపై సమాజానికి అవగాహన కల్పించే వేదికగా నిలవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో దివ్యాంగుల ప్రతిభను ప్రదర్శించేలా సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో పాటు విజయగాథలకు చోటు కల్పించాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమ నిర్వహణలో అన్ని సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో భాగస్వాములు కావాలని కోరారు.

👉 ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు, సూచనలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సాధికారత దిశగా ప్రభుత్వం, సంఘాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో దివ్యాంగుల ఉద్యమ సంఘాల నాయకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
