👉 మాజీ మంత్రి కొప్పుల వ్యాఖ్యలపై మండల కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం అభివృద్ధిపై చర్చకు సిద్ధం.!
J.SURENDER KUMAR,
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ మాట్లాడారు.
👉 ఈ సందర్భంగా చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ…..
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడటం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. తాను 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశానని, లక్ష్మణ్ కుమార్ చెబితే తాము వినాలా అని మాట్లాడటం సరికాదన్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురించి మాట్లాడే ముందు ధర్మపురి నియోజకవర్గానికి గతంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
👉 కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి నేడు తెలంగాణ ప్రజలందరికీ తెలుసని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు మంత్రి లక్ష్మణ్ కుమార్ గతంలో అనేకసార్లు ఓటమి చెందిన కూడా ప్రజలకు దూరంగా ఉండకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని చేశారని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించబోవని హెచ్చరించారు.
👉 కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ మాట్లాడుతూ…..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధి ఏమిటో తెలుసుకోవాలంటే నాయకులు ధర్మపురికి వచ్చి కళ్లారా చూడాలని సూచించారు.
👉 గతంలో మూతపడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంస్కృత ఆంధ్ర కళాశాలను తిరిగి ప్రారంభించిన ఘనత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేసవికాలంలో తాగునీటి సమస్యతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నాలు చేసిన పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం ప్రతి వాడలో బోరు పంపులు, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
👉 ధర్మపురి పట్టణంలో సుమారు ₹ 22 కోట్ల అమృత్ పథకం నిధులతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF), ఎల్ఓసీ నిధులు త్వరితగతిన మంజూరు చేయిస్తూ నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.
👉 అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, డిగ్రీ కళాశాల తరగతులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి ధర్మపురికి బస్ డిపో మంజూరు చేయించేందుకు హామీ పొందామని వెల్లడించారు.
👉 మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రజల మధ్య ఉండకుండా, ఇప్పుడు రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు.
👉 తమ నాయకుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తమకు నేర్పిన విధానం అభివృద్ధి పనులతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడమని, వ్యక్తిగత విమర్శలకు తాము ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. అయితే మంత్రిపై వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
