👉 డిసెంబర్ 11 నుంచి 22 వరకు….!
👉 అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
👉 యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాశ్వత ప్రాతిపదికన యూత్ గేమ్స్ ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఈ క్రీడల కోసం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
👉 తెలంగాణలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో సమీక్షించారు.
👉 తెలంగాణ కర్రసాము క్రీడను కూడా ఆతిథ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చే విధంగా వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు.

👉 రానున్న కాలంలో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి క్రీడా శిక్షణను తెలంగాణ యువ క్రీడాకారులకు అందించేందుకు ఈ పోటీలను గొప్ప అవకాశంగా మలుచుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
👉 క్రీడల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ కోసం గ్రూప్-1 స్థాయి అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. పలు క్రీడలు వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్నందున వాటి పర్యవేక్షణ కోసం స్థానికంగా పనిచేస్తున్న అధికారులను నియమించాలని అన్నారు.
👉 క్రీడాకారులకు వసతి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. యూత్ గేమ్స్ నిర్వహణ, పురోగతిపై ఇకనుంచి ప్రతి వారం సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో క్రీడా పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలలో అనవసరమైన ఆడంబరాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు.
👉 ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి వనరులను ఖేలో ఇండియా పోటీలకు సైతం ఉపయోగించుకోవాలని సూచించారు. క్రీడలు, క్రీడాభివృద్ధి రంగాలకు పెట్టుబడులను ఆకర్షించడం కూడా గ్లోబల్ సమ్మిట్‌లో అంతర్భాగమని, అందువల్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
👉 ఖేలో ఇండియా క్రీడల్లో దేశవ్యాప్తంగా వేలాదిగా యువ క్రీడాకారులు పాల్గొననున్నారు. దాదాపు 2 వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో మొత్తం 20 వేదికలపై 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు.
👉 ఈ పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు సత్తా చాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమావేశంలో అధికారులు వివరించారు. వివిధ క్రీడల నిర్వహణ కోసం 20 వేదికల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై తెలిపారు.
👉 తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
👉 ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి , స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) ఎ. వాణీ ప్రసాద్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ ఎ. సోనిబాలా దేవి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
