మాదిగ ఉద్యోగులకు ప్రమోషన్లలో న్యాయం!

👉 ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వ స్పష్టమైన ఆదేశాలు..!

👉 మంత్రి అడ్లూరి చొరవకు మాదిగ ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. !

👉 నియామకాలు, బదిలీలు, పదోన్నతుల్లో నిబంధనల అమలుకు స్పష్టత.. !

👉 సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాల నాయకులు..!

J.SURENDER KUMAR,

సామాజిక న్యాయం దిశగా మరో కీలక ముందడుగు.. ఎస్సీ వర్గీకరణ అమలులో ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా మాదిగ ఉద్యోగులకు ప్రమోషన్లు, నియామకాలు తదితర అంశాల్లో నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు మార్గం సుగమం కావడంపై మాదిగ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

👉 మంత్రి అడ్లూరికి ఘన సత్కారం..!

ఎస్సీ వర్గీకరణ అనంతరం ప్రమోషన్లతో పాటు ఇతర ఉద్యోగ సంబంధిత అంశాల్లో నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా ప్రభుత్వం తీసుకున్న చొరవపై మాదిగ ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా స్పందించాయి. సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ స్పష్టమైన ఆదేశాలు వచ్చేలా కృషి చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపాయి.

ఈ మేరకు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి పూలబొకే అందజేసి ఘనంగా సత్కరించారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగతో పాటు వివిధ మాదిగ ఉద్యోగ సంఘాలు, దళిత సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి ఈ విషయంలో స్పష్టత తీసుకురావడం అభినందనీయమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

👉 వర్గీకరణ అమలుపై సర్కారు స్పష్టత..!

ఎస్సీ వర్గీకరణ అమలులో కొన్ని శాఖల స్థాయిలో స్పష్టత లోపిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో తాజా ఆదేశాలు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన Memo No.1628/SCD(POA.A2)/2026, తేదీ 26.10.2026 ద్వారా గతంలో ఇచ్చిన ఆదేశాలను పునరుద్ఘాటించింది.

ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన Act No.15 of 2025, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు ఎలాంటి మినహాయింపు లేకుండా అమలు చేయాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ నియామకాలు, బదిలీ ద్వారా నియామకాలు, ప్రమోషన్లు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో జారీ చేసిన Memo No.1762/SCD.POA.A2/2025, తేదీ 25.11.2025లోని ఆదేశాలను కూడా తాజాగా పునరుద్ఘాటించింది.

👉 సచివాలయ శాఖలకు కూడా ఆదేశాలు…!

సాంఘిక సంక్షేమ శాఖ మెమో అనంతరం G.A. (Ser.D) Department U.O. Note No.7509/Ser.D/A1/2026, తేదీ 28.10.2026 ద్వారా సచివాలయంలోని అన్ని శాఖలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.
తమ పరిధిలోని హెచ్‌ఓడీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, పీఎస్‌యూలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కూడా అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించింది.


ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టం, ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాల అమలులో ఎలాంటి deviation ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల అమలులో ఎక్కడైనా ఉల్లంఘనలు గుర్తించినట్లయితే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని జీఏ శాఖ హెచ్చరించింది.

👉 సామాజిక న్యాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం..!

ఎస్సీ వర్గీకరణను నిబంధనల ప్రకారం కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగతో పాటు వివిధ దళిత సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక న్యాయం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వారు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వల్ల ప్రమోషన్లు, నియామకాలు, బదిలీ ద్వారా నియామకాలు తదితర అంశాల్లో నిబంధనల ప్రకారం వ్యవహరించేందుకు స్పష్టత ఏర్పడిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, ఫైనాన్స్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ శాఖ, విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన పలువురు మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

👉 ఉద్యోగుల హక్కులకు భరోసా.. సామాజిక న్యాయానికి బాట..!

ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఆదేశాలు ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో కీలకంగా నిలవనున్నాయి. నిబంధనల అమలుతో పదోన్నతులు, నియామకాల్లో న్యాయం జరిగి సామాజిక సమానత్వం మరింత బలోపేతం కావాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఆకాంక్షించారు.