👉 గత పదేళ్ల నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
👉 575 టీఎంసీల వాటా కోసం సుప్రీంకోర్టు నుంచి కేంద్రం వరకు పోరాటం. !
👉 299 టీఎంసీలకే అంగీకరించారా? గత ప్రభుత్వ జీవోలతో ప్రశ్నలు !
👉 పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం అప్పుడే పడిందన్న సీఎం.. చుక్క నీటిని వదులుకోబోమని స్పష్టీకరణ !
J.SURENDER KUMAR,
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను సాధించుకునే విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు స్థాయిలో పోరాటం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.
కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, గత ప్రభుత్వ నిర్ణయాలపై వాస్తవాలను వివరించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

👉 575 టీఎంసీల వాటా కోసం తెలంగాణ డిమాండ్!
ఈ హక్కు కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరంతరంగా ప్రయత్నిస్తోందన్నారు. కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖకు పలుమార్లు విజ్ఞప్తులు చేశామని, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర సమస్యను వివరించామని చెప్పారు. న్యాయమైన వాటా కోసం సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు.
👉 299 టీఎంసీల అంశంపై సీఎం ప్రశ్నలు !
2015లో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున తాత్కాలిక నీటి పంపిణీ విధానం అంగీకారానికి వచ్చిందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తెలంగాణకు 575 టీఎంసీల వాటా దక్కాల్సి ఉండగా, 299 టీఎంసీలతో సరిపెట్టుకున్నారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అయితే ఈ విషయంలో ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రజలు గమనించాలి. 2015 జూన్ 18, 19 తేదీల్లో కుదిరినది ఆ సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక నీటి పంపిణీ విధానం. రాష్ట్రాల అసలు నీటి హక్కులకు భంగం కలగకుండా ఈ ఏర్పాటు చేసినట్లు కేఆర్ఎంబీ వార్షిక నివేదికలోనూ పేర్కొంది. అనంతరం 66:34 నిష్పత్తి అమలులోకి వచ్చింది.
👉పల్నాడు వాటర్ గ్రిడ్.. జీవో నంబర్ 56పై వివరణ !
ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటూ వస్తున్న ఆరోపణలను సీఎం ఖండించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2022 ఫిబ్రవరి 16న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 56ను మీడియా ముందు ప్రదర్శించారు.
₹.1,200 కోట్లతో గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు ఈ జీవో ద్వారా అవకాశం కల్పించారని వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి ₹ 500 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్‌కు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు.
ఈ జీవో జారీ అయిన సమయంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అప్పటి పాలకులు ఈ అంశంపై తగిన అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని సీఎం ఆరోపించారు. ఈ ప్రాజెక్టు విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే కేఆర్ఎంబీ, కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
👉 పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై అభ్యంతరాలేవీ చెప్పలేదా?
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించే సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే విషయంలో గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు జరిగాయని సీఎం ఆరోపించారు. 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పరిణామాలను కూడా ప్రస్తావించారు.
హంద్రీనీవా, గాలేరు నగరి, ఇతర ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సమయంలో తెలంగాణలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని విమర్శించారు.
ప్రాజెక్టులకు అవసరమైన భూములను సేకరించకుండా, బాధితులకు పరిహారం చెల్లించకుండా నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అధికారిని నియమించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు వివరించారు.
👉 నీటి వినియోగంలో మా ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ!
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ముఖ్యమంత్రి పలు గణాంకాలను వెల్లడించారు.
2023-24లో తెలంగాణ 119 టీఎంసీల నీటిని వినియోగించిందని తెలిపారు.
2024-25లో ప్రజా ప్రభుత్వం 285.17 టీఎంసీల నీటిని వినియోగించిందన్నారు.
2025-26లో 268.17 టీఎంసీల వినియోగం జరిగిందని వెల్లడించారు.
ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఎక్కువ కృష్ణా జలాలను వినియోగించుకుందని సీఎం వివరించారు. ఇవి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించిన గణాంకాలు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలో రాజకీయంగా, న్యాయపరంగా అన్ని మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కులను సాధించడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
