మాజీ మావోయిస్టులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సాయం.!

👉 తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాట్లు..

👉 214 మందికి ₹ 5.59 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన డీజీపీ!


J.SURENDER KUMAR,


లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం, జనజీవన స్రవంతిలోకి వారిని ఆహ్వానించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ‘లొంగుబాటు మరియు పునరావాస విధానం’ కింద సోమవారం 214 మంది మాజీ సీపీఐ (మావోయిస్టు) కేడర్లకు ₹ 5.59 కోట్ల నగదు రివార్డులను డీజీపీ సీవీ ఆనంద్ పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పిలుపుతో పెరిగిన లొంగుబాట్లు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని 2025 అక్టోబర్ 21న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో మావోయిస్టుల లొంగుబాట్లు ఊపందుకున్నాయని డీజీపీ తెలిపారు.

2024 జనవరి 1 నుండి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 824 మంది అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వివరించారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ కార్యదర్శులు, సభ్యులు, పార్టీ సభ్యులు మరియు మిలీషియా సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు.


👉 రాష్ట్రాల వారీగా లొంగిపోయిన వారి వివరాలు:


ఇప్పటివరకు లొంగిపోయిన 824 మందిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్: 754 మంది, తెలంగాణ: 59 మంది, ఆంధ్రప్రదేశ్: 9 మంది, మహారాష్ట్ర: 1, ఒడిశా: 1 మొత్తం ₹ 17.68 కోట్ల రివార్డుల పంపిణీ తాజాగా 214 మందికి ₹5.59 కోట్లు అందించడంతో, ఇప్పటివరకు నగదు రివార్డులు అందుకున్న లబ్ధిదారుల సంఖ్య 659కి చేరిందని, మొత్తం పంపిణీ చేసిన నగదు ₹ 17.68 కోట్లకు చేరుకుందని డీజీపీ తెలిపారు.
అర్హులైన మిగిలిన 96 మంది కేడర్లు తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించిన వెంటనే వారికి మంజూరైన రివార్డులను అందజేస్తామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.