👉 పరిశోధనాత్మక దృష్టికి, సాహిత్య విమర్శకు అద్దం పట్టిన వారిజారాణి రచనలు..!
👉 పలువురు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యావేత్తల ప్రశంసలు..!
J.SURENDER KUMAR,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యురాలు, పరిశోధకురాలు, రచయిత్రి ఆచార్య పి. వారిజారాణి రచించిన వ్యాసవిలాసం, వ్యాసవిరించి, వ్యాసవిహంగం, వ్యాసవిపంచి నాలుగు గ్రంథాల ఆవిష్కరణ మహోత్సవం బుధవారం నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ‘వికసిత వారిజాలు’ శీర్షికన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముదిగొండ వీరభద్రయ్య అధ్యక్షత వహించారు. వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, మాజీ ఉపకులపతులు, ఆచార్యులు, సాహితీవేత్తలు, పరిశోధకులు పాల్గొని వారిజారాణి సాహిత్య, పరిశోధనా కృషిని ప్రశంసించారు.

👉 ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ,….
అధ్యాపకులకు ఉండాల్సిన తొమ్మిది ముఖ్య లక్షణాలైన శుచి, జ్ఞానం, ప్రజ్ఞ, చక్కటి వాక్కు, తేజస్సు వంటి గుణాల సమాహారంగా వారిజారాణి నిలుస్తారని అన్నారు. అనువాదం, అలంకారశాస్త్రం, కవిత్వం, నాటకం వంటి భిన్న సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన వ్యాసాల సమాహారంగా ఈ గ్రంథాలు ఉన్నాయని పేర్కొన్నారు.
👉 వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యాధనంజయ్ మాట్లాడుతూ,..
వారిజారాణి ఒక్కొక్క వ్యాసాన్ని ఒక్కొక్క శిల్పంలా చెక్కారని ప్రశంసించారు. సాహిత్యం సమాజానికి అద్దం పడుతుందని, భవిష్యత్తు తరాలకు కరదీపికగా నిలుస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వారిజాలను వికసింపజేయాలని ఆకాంక్షిస్తూ రచయిత్రిని అభినందించారు.
👉 సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ,…
ఉస్మానియా మహిళా కళాశాలలో వారిజారాణి బోధించే తరగతులకు విద్యార్థులు ఎంతో ఆసక్తితో పరుగెత్తుకుంటూ వచ్చేవారని గుర్తుచేశారు. విద్యార్థుల, విద్యాసంస్థ అభివృద్ధినే తన శ్వాసగా భావించి పనిచేసిన గొప్ప అధ్యాపకురాలని అన్నారు. అద్భుతమైన వాక్కు ఆమెకు భూషణమని, అధ్యాపకురాలిగానే కాకుండా అసాధారణ వక్తగా, రచయిత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం కాకుండా సాహిత్య నిబద్ధతతో రచనలు చేసిన వ్యక్తి వారిజారాణి అని కొనియాడారు.
👉 ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ, …
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా, మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి వారిజారాణి తన పాలనా దక్షతను నిరూపించుకున్నారని అన్నారు. బంజారా భాష పరిరక్షణకు ఆమె చేస్తున్న కృషి ప్రత్యేకమని పేర్కొన్నారు. తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాలతో పాటు జానపద సాహిత్యంపై ఆమె చేసిన పరిశోధనలు గొప్పవని, భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని నేటి సమాజానికి అందించే ప్రయత్నం అభినందనీయమని అన్నారు.
👉 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య సాగి కమలాకరశర్మ మాట్లాడుతూ,….
అధ్యాపకురాలిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ విద్యార్థిలా నోట్స్ రాసుకుంటూ నిరంతరం అధ్యయనం చేయడం వారిజారాణి ప్రత్యేకత అని అన్నారు. వ్యాకరణం, సంస్కృతం, భాషాశాస్త్రంలో ఆమెకు అసాధారణ ప్రతిభ ఉందని పేర్కొన్నారు. నేటి విద్యార్థులకు అవసరమైన వారిజ వ్యాకరణం వెలువడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
👉 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులు డా. ఎస్. రఘు మాట్లాడుతూ,…
వారిజారాణి అధ్యాపకత్వానికి, నిరంతర అధ్యయనానికి ఈ పుస్తకాలు నిదర్శనాలని అన్నారు. సాధారణ వ్యాసాల మాదిరిగా కాకుండా తనదైన ముద్రతో వ్యాసాలను ప్రారంభించడం ఆమె ప్రత్యేకత అని పేర్కొన్నారు. కన్యాశుల్కంలోని స్త్రీ పాత్రలపై ఆమె చేసిన విశ్లేషణలు కొత్త ఒరవడికి నాంది పలికాయని అన్నారు. కథా వస్తువుకే పరిమితం కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలను లోతుగా పరిశీలించడం ఆమె రచనల్లో కనిపిస్తుందని తెలిపారు. పొట్లపల్లి రామారావు వంటి రచయితల తాత్వికతను పట్టుకున్న క్రాంతదర్శి వారిజ అని ప్రశంసించారు. టెలివిజన్ భాషపై రాసిన వ్యాసం ఆమె పరిశోధనా వైవిధ్యానికి నిదర్శనమని, పాండిత్య ప్రదర్శనకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో రచనలు చేయడం ఆమె విశిష్టత అని అన్నారు.
👉 హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ, …
ఎవరూ పెద్దగా స్పృశించని వినూత్న అంశాలను ఎంచుకుని రచనలు చేయడం ద్వారా వారిజారాణి విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను పెంచారని అభినందించారు.
👉 సంస్కృతాంధ్ర ప్రాచ్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. సంగనభట్ల నరసయ్య మాట్లాడుతూ,…

ధర్మపురి నుంచి హైదరాబాద్ వరకు సాగిన వారిజారాణి ప్రస్థానంలో వినయం, శ్రద్ధ, ప్రతిభ పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఆమె పరిశోధనా పటిమకు ఈ గ్రంథాలు నిదర్శనాలని పేర్కొన్నారు.
👉 కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం డైరెక్టర్, హెచ్ఓడీ డా. శ్రీధర్ మాట్లాడుతూ, ..

వారిజారాణి సునిశిత పరిశీలనా దృష్టికి, విశ్లేషణాత్మక ప్రతిభకు ఈ పుస్తకాలు తార్కాణాలని అభిప్రాయపడ్డారు.
👉 కార్యక్రమ అధ్యక్షులు ముదిగొండ వీరభద్రయ్య మాట్లాడుతూ, …
వారిజారాణి రచనలు సాహిత్య విలువలతో పాటు పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. మేలిమి కూతురైన వారిజ కవిత్వం పాఠకుల ఒళ్లు పులకరించేలా ఉంటుందని పేర్కొన్నారు. సాహిత్యంలో విషయం ఉన్నప్పుడే రచనకు శాశ్వతత్వం లభిస్తుందని, తులనాత్మక పరిశోధనలో పోలికలు, విశ్లేషణలు అత్యంత ముఖ్యమని అన్నారు. సాహిత్య విమర్శలోని మౌలిక అంశాలన్నింటికీ వారిజారాణి పుస్తకాలు నిదర్శనాలని ప్రశంసించారు.

అనంతరం ‘వికసిత వారిజాలు’ శీర్షికన నాలుగు గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత్రి ఆచార్య పి. వారిజారాణి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు మాతామహులు, పితామహులను స్మరించుకున్నారు. తన సాహిత్య, జీవిత ప్రయాణంలో తోడు నీడగా నిలిచిన సహచరుడు విష్ణుప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, సాహిత్యాభిమానులు పాల్గొని ఆచార్య పి. వారిజారాణికి అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని సరస్వతీ ప్రదీప్ సమన్వయంతో నిర్వహించారు.
