👉 నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట బహిరంగ సభలో..!
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన….!
J.SURENDER KUMAR,
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. వచ్చే సంవత్సర కాలంలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి నియామకాలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు.
👉 ముఖ్యమంత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
👉 అలాగే, రాష్ట్రంలోని దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు సంతృప్తస్థాయిలో కొత్తగా 4.89 లక్షల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో దాదాపు ₹ 450 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
👉 ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ , జూపల్లి కృష్ణారావు , ధనసరి అనసూయ , వాకిటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.
👉 ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, …..

ఉద్యోగ నియామకాలతో పాటు పాలమూరులోని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా భూముల్లో కృష్ణా జలాలను పారిస్తామన్నారు.
👉 తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలని గుర్తుచేస్తూ, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతే 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొంటూ మరో సంవత్సర కాలంలో మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్నారు.
👉 ఆ ప్రాంత చారిత్రక ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి వివరిస్తూ.. “నేను ఈ గడ్డమీద పుట్టిన బిడ్డను. ఈ నల్లమల.. ఈ అచ్చంపేట నా సొంత ప్రాంతం. ఈ ప్రాంతానికి మీ బిడ్డగా చేయాల్సిన అభివృద్ధి, సమస్యలను పరిష్కరించడానికి సర్వం ఒడ్డి మీ బిడ్డగా రుణం తీర్చుకుంటా” అని అన్నారు.

👉 ఆనాటి రాణి అచ్చమాంబ తరహాలోనే తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే గడిచిన 3 ఏండ్లుగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. దేశానికి జవహర్లాల్ నెహ్రూ లాంటి నాయకుడు విద్య, నీటిపారుదల రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తీరును సోదాహరణగా వివరించారు.
👉 రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువకుల కోసం నిరతరం పనిచేస్తామని చెప్పారు. ఒకవైపు విధ్వంసం, మరోవైపు అప్పులతో సతమతమవుతున్న తెలంగాణను వికాసంవైపు నడిపించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు. గడిచిన 34 నెలల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా అహర్నిశలు పనిచేస్తున్నామని తెలిపారు.


👉 నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అచ్చంపేట ఎత్తిపోతల, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ₹ 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు.
👉 ఆ ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఈరోజు కృష్ణా జలాల సమస్యే ఉండేది కాదన్నారు. ఆ ప్రాజెక్టుల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకుని ఉండగలిగితే ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాలు సాగయ్యేవన్నారు. ఈ జిల్లా బిడ్డగా పాలమూరు పొలాలను కృష్ణా నీటితో తడపాల్సిన బాధ్యత తనకుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
👉 ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం దశాబ్దాలుగా కొట్లాడారని గుర్తుచేస్తూ ఉపకులాల వర్గీకరణ చేశామని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో కులగణన జరగని కారణంగా ఎవరెంత మంది ఉన్నారన్న గణాంకాలే లేవని, అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మొదటిసారి జనాభా లెక్కలు చేయించి కులాల వారిగా ఎవరెంత మంది ఉన్నారు.. వారి జీవన ప్రమాణాలు ఎట్లున్నయో లెక్క తేల్చి దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు.

👉 రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యమిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ కుటుంబ బీమా, ఇందిరమ్మ చీరలు, ఉచిత కరెంట్, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ… ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
👉 నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు ₹79 వేల కోట్ల మేరకు రుణాల లింకేజీ, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి సంక్షేమ కార్యక్రమాలను సోదాహరణగా వివరిస్తూ, అంతకుముందు పదేళ్ల ప్రభుత్వంలో, ఇప్పటి ప్రభుత్వ మూడేండ్ల పాలనలో అమలు చేసిన కార్యక్రమాలను బేరీజు వేయాలని కోరారు.
👉 ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో పార్టీ, కులం లేదు. ఎవరిపట్లా వివక్ష చూపించకుండా అందరికీ సమంగా అమలు చేస్తున్నామని అన్నారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు, ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం వంటి సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందిస్తున్నామని ఉదహరించారు.

👉 దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు పూర్తిస్థాయిలో ఈరోజు 4.89 లక్షల కొత్తగా ఇచ్చే పింఛన్లతో రాష్ట్రంలో మొత్తంగా 6,00,858 పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. “పేదవారే మా బంధువులు. పేదవారిని ఆదుకోవడమే మా లక్ష్యం. ఇందిరమ్మ వారసత్వంలో పేదవారిని గుండెల్లో పెట్టుకుని చూడాల్సిన బాధ్యత మాపై ఉంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.
