పట్టణాల అభివృద్ధికి ₹ 20 వేల కోట్ల నిధులు..!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు.


👉 ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ (KFW) బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు ₹ 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.


👉 వరంగల్‌ నగర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.


👉 రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్‌టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు అవకాశముంది.


👉 పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడంపై ముఖ్యమంత్రి  అధికారులకు పలు సూచనలు చేశారు.


👉 వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను సమీక్షించారు. బయో సీఎన్‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.


👉 ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా నిర్దేశించారు.