👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…!
J.SURENDER KUMAR,
పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కాటారం మండలం ధన్వాడ, మేడిపల్లి గ్రామాలలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.
ఈసందర్భంగా లబ్ధిదారులు ఏపూరి పుష్పలత, గుండ్ల రమ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ పిల్లలు ఏం చదువుతున్నారంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, బాణసంచా బహుకరించారు. అనంతరం వారితో కలిసి టపాసులు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు దశలవారీగా సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సమష్టి కృషితో ఈ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
👉 కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన ఏపూరి పుష్ప లత, మేడిపల్లి గ్రామానికి చెందిన గుండ్ల రమ కుటుంబంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న పేద కుటుంబాలు తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. లబ్ధిదారులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

👉 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, మండల, గ్రామస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. అధికారుల సమన్వయం, ప్రజల సహకారంతోనే నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు.
👉 కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల సహకారంతో సమష్టిగా పోరాడి విజయం సాధించినట్లుగానే, ఎల్ నినో విపత్తును ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా ఎదుర్కొంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 ఈ దీపావళి పర్వదినం సందర్భంగా ధన్వాడ గ్రామ ప్రజలకు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి శ్రీధర్ బాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

👉 ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీకాంత్, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
