పెంచిన మమకారాన్ని- తుంచలేకపోయారు!

👉 మూడేళ్ల బాలుడి కన్నీళ్లకు కరిగిన యంత్రాంగం.!

👉 మాతృమమకారం ముందు అధికారిక అడ్డుగోడలు బద్దలు.!

👉 మూడేళ్ల బాలుడికి అమ్మ ఒడిలో మళ్లీ చోటు.. మాతృత్వపు మమకారానికి మానవతా పరిష్కారం!

👉 పసివాడి కన్నీళ్లతో కదిలిన సమాజం.. చివరకు సామరస్యపూర్వకంగా ముగిసిన దత్తత వివాదం!

👉 న్యాయపోరాటం చేసిన పెంపుడు తల్లిదండ్రులు.. బాలుడి భవిష్యత్తుకు చట్టబద్ధమైన భరోసా!

👉 హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం–1956 ప్రకారం దత్తత ప్రక్రియ పూర్తి!

👉 రిట్ అప్పీల్ ఉపసంహరణకు ప్రభుత్వానికి నివేదిస్తాం:     

  👉   జగిత్యాల  జిల్లా యంత్రాంగం !

J.SURENDER KUMAR,

అమ్మ ఒడికి దూరమైన మూడేళ్ల పసిబిడ్డ కన్నీళ్లు.. పెంచిన తల్లిదండ్రుల మమకారం.. న్యాయం కోసం సాగించిన అలుపెరుగని పోరాటం.. చివరకు మానవతా దృక్పథంతో లభించిన పరిష్కారం! చట్టపరమైన వివాదం కారణంగా మూడు నెలలుగా శిశు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న చిన్నారి తిరిగి పెంపుడు తల్లిదండ్రుల ఒడికి చేరనున్నాడు.


జగిత్యాల జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన దత్తత వివాదానికి జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్రత్యేక చొరవతో సామరస్యపూర్వక ముగింపు పలికింది.

👉 కన్నీళ్లు పెట్టుకున్న పసివాడి ఆవేదన !

మూడేళ్ల క్రితం సంతానం లేని దంపతులు తమ బంధువులకు చెందిన నెలరోజుల మగ శిశువును దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే దత్తత ప్రక్రియ హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం నిబంధనల ప్రకారం జరగలేదంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. దీంతో బాలుడిని బాలల సంరక్షణ అధికారులు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

తమతో కలిసి పెరిగిన చిన్నారి ఒక్కసారిగా దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాలుడిని తిరిగి తమ వద్దకు తీసుకురావాలనే సంకల్పంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్‌లో బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆదేశాల అమలుపై వివాదం కొనసాగింది.

ఈ క్రమంలో పెంపుడు తల్లిదండ్రులు బాలుడిని చూడటానికి శిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లగా.. తనను తీసుకెళ్లాలని, అక్కడ ఉండలేనని భయపడుతున్నానని మూడేళ్ల చిన్నారి కన్నీళ్లతో విలపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో సమాజం దృష్టి ఈ వ్యవహారంపై పడింది.

👉 మమకారానికి మానవతా పరిష్కారం!

ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు చేపట్టారు. అయితే దత్తత ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు పాటించలేదనే అంశంపై ప్రభుత్వం హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసి పునఃపరిశీలన కోరింది.


ఈ నేపథ్యంలో చిన్నారి భవిష్యత్తు, కుటుంబ భద్రత, మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిపాలనా యంత్రాంగం మరోసారి ప్రత్యేక చొరవ తీసుకుంది. సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ వివాదానికి చట్టబద్ధమైన, సామరస్యపూర్వక పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టింది.

👉 చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ పూర్తి !

తాజాగా హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం–1956 (Hindu Adoptions and Maintenance Act, 1956) ప్రకారం స్థానిక జగిత్యాల సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో దత్తత ప్రక్రియను పూర్తి చేశారు. సంబంధిత బాలల సంక్షేమ అధికారుల సమక్షంలో అవసరమైన ప్రక్రియను నిర్వహించి చిన్నారి భవిష్యత్తుకు చట్టపరమైన భరోసా కల్పించారు.
దత్తతకు సంబంధించిన వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడంతో, గతంలో దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా పరిపాలనా యంత్రాంగం వెల్లడించింది.

👉 చిన్నారి శ్రేయస్సే అసలైన విజయం !

పెంపుడు తల్లి ఒడిలో బాలుడు తల్లి కళ్ళలో ఆనందం(ఫైల్ ఫోటో)

ఈపరిణామం ఒక కుటుంబానికి లభించిన ఉపశమనం మాత్రమే కాదు.. బాలల సంక్షేమం విషయంలో చట్టబద్ధతతో పాటు మానవతా విలువలకు కూడా ప్రాధాన్యత ఉండాలనే విషయాన్ని గుర్తుచేస్తోంది. చట్టాలు బాలల హక్కులను కాపాడటానికే.. అధికార యంత్రాంగం వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడానికే.. కానీ ఆ ప్రక్రియలో పసివారి మనసులు గాయపడకుండా చూడటం కూడా అంతే ముఖ్యం.

మూడేళ్ల చిన్నారికి కావాల్సింది భద్రమైన కుటుంబ వాతావరణం, ప్రేమ, ఆప్యాయత, అమ్మానాన్నల ఒడిలో లభించే భరోసా. ఆ చిన్నారి కన్నీళ్లతో మొదలైన ఈ ఉదంతం.. చివరకు చట్టబద్ధమైన పరిష్కారంతో సుఖాంతం కావడం సమాజానికి ఒక మానవీయ సందేశం.