రౌడీషీటర్లకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ షాక్.!

👉 శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. లక్ష పూచీకత్తుతో బైండోవర్.!


👉 BNSS సెక్షన్లు 126 నుంచి 136 ప్రకారం బైండోవర్ చర్యలు..!


👉 నిబంధనలు ఉల్లంఘిస్తే పూచీకత్తు జప్తు.. జైలుశిక్ష తప్పదని హెచ్చరిక..!


J.SURENDER KUMAR,

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 15 మంది రౌడీషీటర్లను బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఐపీఎస్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేశారు.

👉 ₹ 1,లక్ష పూచీకత్తుతో బైండోవర్..!

కరీంనగర్ పోలీస్ కమిషనర్‌తో పాటు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్)గా వ్యవహరిస్తున్న గౌస్ ఆలం ఎదుట 15 మంది రౌడీషీటర్లను హాజరుపరిచారు. ఈ సందర్భంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS)లోని 126 నుంచి 136 సెక్షన్ల ప్రకారం విచారణ చేపట్టారు. ఏడాది పాటు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా సత్ప్రవర్తనతో మెలుగుతామని ఒక్కొక్కరి నుంచి ₹ 1,00,000/- పూచీకత్తుతో కూడిన బాండ్లను రాయించుకున్నారు.

👉 నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. !

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం రౌడీషీటర్లను తీవ్రంగా హెచ్చరించారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడినా, ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బైండోవర్ సమయంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తే పూచీకత్తు సొమ్మును జప్తు చేయడంతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే జైలుశిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

👉 అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా..!

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని కమిషనర్ తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, గొడవలు సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


👉 ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యం..!


నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడం, ప్రజలు నిర్భయంగా జీవించే పరిస్థితులు కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకుని సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదనే స్పష్టమైన సంకేతాన్ని ఈ బైండోవర్ చర్యలు పంపుతున్నాయి.