👉 ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ భవిష్యత్తుకు బలమైన పునాది ..
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J. SURENDER KUMAR,
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కార్యాచరణలో భాగంగా రాష్ట్రం నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
👉 డిసెంబర్ 11 నుండి 22 వరకు తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నేపథ్యంలో ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి మంత్రి వాకిటి శ్రీహరి తో పాటు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు.
👉 యువతలో నూతన ఉత్సాహం కలిగించే విధంగా డిసెంబర్ 11న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
👉 ప్రారంభ వేడుకలను ఎల్బీ స్టేడియంలో, ముగింపు వేడుకలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. హైదరాబాద్ నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈ క్రీడల కోసం స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, విజిలెన్స్ నిఘా ఉండాలన్నారు.
👉 ప్రారంభోత్సవం, ముగింపు వేడుకల పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో కూడా పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటి పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఇన్చార్జిలుగా నియమించాలన్నారు.
👉 పొన్నం ప్రభాకర్ ను హైదరాబాద్‌కు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను రంగారెడ్డి జిల్లాకు, జూపల్లి కృష్ణారావు ను మహబూబ్‌నగర్‌కు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని వరంగల్‌కు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కరీంనగర్‌కు, తుమ్మల నాగేశ్వరరావు ను ఖమ్మంకు, సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ని నిజామాబాద్ జిల్లాకు బాధ్యులుగా నియమించి క్రీడలను పర్యవేక్షించేలా చూడాలని చెప్పారు.

👉 ముఖ్యమంత్రి సూచన మేరకు తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళ కర్రసాము ఈ పోటీల్లో ప్రదర్శన క్రీడగా తొలిసారి అడుగుపెడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కర్రసాముకు సంబంధించి రూపొందించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. జాతీయ వేదికపై కర్రసాముకు సముచిత స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఈ క్రీడకు ప్రోత్సాహం అందుతుందని అభిప్రాయపడ్డారు.
👉 ఈ నెలాఖరు వరకు స్టేడియాలకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులు, 27 క్రీడలకు సంబంధించి అవసరమైన క్రీడా పరికరాలు సిద్ధం చేయనున్నట్టు సమావేశంలో అధికారులు తెలిపారు. ఇప్పటికే 14 స్టేడియాలలో పనులు పూర్తికాగా, మిగిలిన 6 చోట్ల నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నట్టు చెప్పారు.
👉 ఖేలో ఇండియాలో 27 క్రీడలకు సంబంధించిన 1,334 మంది తెలంగాణ క్రీడాకారులకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. రాష్ట్రం నుంచి ఈ యూత్ గేమ్స్‌లో పాల్గొనే 861 క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
👉 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ₹ 203 కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ₹ 21 కోట్లు కేటాయించింది. స్టేడియాలలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు, అత్యాధునిక క్రీడా పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹ 120 కోట్లు వెచ్చిస్తోంది. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని క్రీడా ప్రాంగణాలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు.
