👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
పెట్టుబడులకు సంబంధించి వివిధ వేదికలపై తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని స్పష్టంగా చెప్పారు.
👉 రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పలు కంపెనీలతో కుదిరిన ఎంవోయూలు కార్యరూపం దాల్చడంలో ఆయా సంస్థల కార్యకలాపాల పురోగతిపై ముఖ్యమంత్రి హైదరాబాదులో బుధవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
👉 పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
👉 పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
👉 వివిధ రంగాలలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాలను తెలిపారు.

👉 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉 కంపెనీలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసి వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
👉 ఫ్యూచర్ సిటీలో కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
👉 ఏయే ఎంవోయూలు ఎప్పుడు కుదుర్చుకున్నాం, అవి ఏ స్థితిలో ఉన్నాయి, అమలుకు ఉన్న ఆటంకాలు, వాటి పెట్టుబడులు, ఆ సంస్థలు కల్పించే ఉద్యోగాల వంటి అన్ని వివరాలు సీఎంఓ, ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా రియల్ టైమ్ అప్‌డేట్స్‌తో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు.
👉 పెట్టుబడులకు సంబంధించి ఒక పూర్తి స్థాయి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అది పని చేసేలా చూడాలన్నారు. టైర్-2, టైర్-3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
👉 పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి జైకా నిధులతో చేపట్టనున్న పనులపైనా సమీక్షించారు. ఆయా పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
