J.SURENDER KUMAR,
తెలంగాణ పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన డీజీపీ, వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు.
అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు.
సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి !
