సమస్యలపై సింహాలా ముందుకు పోతున్న సీఎం రేవంత్ రెడ్డి !

👉 కేటీఆర్ నేను  నేరెళ్లకు వస్తా దళితులపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలి !

👉 ధర్మపురికి రా.. అభివృద్ధి ఏమిటో చూపిస్తా !

👉 మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి  సింహంలా ముందుకు సాగుతున్నారని,  నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గణాంకాలతో గొంతేత్తిన దేశానికి చాటి చెప్పిన  నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం  మంత్రి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…….

జగిత్యాలలో నిర్వహిస్తున్న బిఆర్ఎస్  సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు  వచ్చిన మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు  శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  అడ్డగోలుగా, అక్రమంగా, అవినీతి ద్వారా డబ్బులు సంపాదించి జగిత్యాల జైత్రయాత్ర పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

👉 2018లో కొండగట్టు ఘాట్ రోడ్ లో జరిగిన ప్రమాదంలో 60 మంది దుర్మరణం చెందితే నాటి ముఖ్యమంత్రి  కేసీఆర్  మృతుల కుటుంబాలను,బాధితులను పరామర్శించలేదని మంత్రి అడ్లూరి విమర్శించారు.

👉 రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రజా ప్రభుత్వంపై బావ, బావ మరుదులు గుంట నక్కల్ల తయారై విషం కక్కుతున్నారని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా, రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఏకవచనంతో సంభోదిస్తున్నారని మరో మారు సీఎం
రేవంత్ రెడ్డి ని ఇలా సంబోధిస్తే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు.

👉 ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో ప్రతిపక్ష హోదాలో  జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఇలాగే ప్రవర్తించారా ? అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కేటీఆర్, హరీష్ రావులు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

👉 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్, హరీష్ రావులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజలు వీరిని విశ్వసించడం లేదని మంత్రి అన్నారు.

👉 మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి చెందారని వరుస ఓటములు తట్టుకోలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ చేస్తున్నారని అభివృద్ధి అంటే ఏమిటి చూపిస్తా ధర్మపురి రావాలని కేటీఆర్ కు మంత్రి సవాల్ విసిరారు.

👉 బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఏనాడు ఆసంక్షేమం గురించి పట్టించుకోలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సంక్షేమ వసతి గృహాలకు ఒకదానికి కూడ  కొప్పుల పక్కా భవనం నిర్మించలేదని మంత్రి ఆరోపించారు.

👉 మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి గౌరవం ఇచ్చి మాట్లాడాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. తాను త్వరలోనే సిరిసిల్లకు వస్తానని  కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ల దళితులపై జరిగిన దాడి పై ప్రశ్నిస్తానని,  కేటీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

👉 జగిత్యాలలో బీఆర్ఎస్  నిర్వహించే సభలో పది  సంవత్సరాల లో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏం చేశారనే వివరణ ఇవ్వాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.