బడి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాష్ట్ర విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సౌకర్యార్థం డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించే దిశగా రూపొందించిన “తెలంగాణ బడి” (telanganabadi.in) విద్యా వెబ్‌సైట్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, తెలుగు భాషా బోధనలో డాక్టర్ గొల్లపెల్లి గణేష్  చేస్తున్న ఈ విశేష కృషిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ప్రముఖ తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ గొల్లపెల్లి గణేష్  స్వయంగా తీర్చిదిద్దారు.

తెలంగాణ రాష్ట్ర తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్ పాఠాలు, ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పేపర్లు, ఇంటరాక్టివ్ క్విజ్‌లు, మరియు వ్యాకరణ అంశాలను విద్యార్థులకు సులభంగా, ఉచితంగా అందుబాటులో ఉంచడమే ఈ వెబ్‌సైట్ ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.