రైతు భరోసా ₹ 2 వేల కోట్లు విడుదల !

👉 44.28 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలో !


👉 ₹ 2,482 కోట్లు జమ !


J.SURENDER KUMAR,


రైతు భరోసా పథకం తొలి విడత నిధులను  రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. 2 ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹ 2,482 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి జమ చేశారు. అర్హులైన రైతులందరికీ దశలవారీగా పెట్టుబడి సాయం అందిస్తామని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ శిల్పకళా వేదికగా మంగళవారం జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కంప్యూటర్ మీట నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు.

👉 వచ్చే 9 రోజుల్లో ₹ 9 వేల కోట్లను విడుదల చేయాలన్న సంకల్పంతో తొలి విడతగా 44.28 లక్షల రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడానికి వీలుగా ₹ 2,482.02 కోట్లను విడుదల చేసింది.

👉 రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1600 రైతు వేదికల ద్వారా రైతాంగం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి  నిధులను విడుదల చేశారు.

👉 శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వాకిటి శ్రీహరి , అజారుద్దీన్ , పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి  మాట్లాడారు

. “రాష్ట్రానికి సంబంధించి గడిచిన 30 నెలలుగా సమాజంలో గౌరవం పెంచుకుంటూ విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించుకుంటూ వెళుతున్నాం” అని పేర్కొన్నారు.

👉 వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ప్రజా ప్రభుత్వ లక్ష్యం మేరకు ఆ రంగానికి చేసిన ఖర్చు గణాంకాలను ముఖ్యమంత్రి  రైతులకు వివరించారు. “గడిచిన 30 నెలల కాలంలో వ్యవసాయ రంగానికి ₹ 1.75 లక్షల కోట్లను ఖర్చు చేశాం. వచ్చిన మొదటి ఏడాదిలోగా 25.35 లక్షల మంది రైతులకు ₹ 2 లక్షల వరకు ₹ 20,677 కోట్ల రుణాలను మాఫీ చేశాం.

👉 గత ప్రభుత్వంలో బకాయి పడిన ₹ 7 వేల కోట్ల రైతు భరోసా నిధులను చెల్లించాం. ₹ 10 వేలు ఉన్న రైతు భరోసాను ₹12 వేలకు పెంచాం. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ₹27 వేల కోట్ల పైచిలుకు రైతు భరోసా నిధులు జమ చేశాం. తాజాగా ఇప్పుడు జమ చేయబోయే నిధులతో కలిపి రైతు భరోసా కింద ₹36 వేల కోట్లు చెల్లించాం.

👉 పండించిన పంటలకు బోనస్‌గా ₹ 4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం ₹ 2 వేల కోట్లు, బీమా కోసం ₹ 3.5 వేల కోట్లు చెల్లించాం. గడిచిన రెండున్నరేళ్లలో వడ్లు కొనుగోలు కోసం ₹ 80 వేల కోట్లకుపైగా చెల్లించాం. రైతులు తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతికేలా వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.

👉 గత ప్రభుత్వంలో పదేళ్లలో ₹1.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ప్రజా ప్రభుత్వం 30 నెలల కాలంలో ₹ 1.75 లక్షల కోట్లు వ్యవసాయంపై ఖర్చు చేసింది. వ్యవసాయ రంగానికి సగటున నెలకు ₹ 6 వేల కోట్లు ఖర్చు పెట్టాం. గతంలో ₹ 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు” అని విడమరిచి చెప్పారు.

👉“30 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేసిన పనులపై శాసనసభ వేదికగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 30 నెలల్లో ఎదురవుతున్న ఎన్నో సమస్యలను అధిగమిస్తూ పరిష్కారాలను చూపిస్తున్నాం.

👉 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 6 దశాబ్దాలు పాలించిన ముఖ్యమంత్రులు చేసిన అప్పు ₹ 69 వేల కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ₹69 వేల కోట్ల అప్పు ఉంటే, 2014 నుంచి ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి అయిన అప్పు ₹ 8.11 లక్షల కోట్లు.

👉 ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పగిస్తే మళ్లీ లేవడానికి వీలులేకుండా అప్పుల ఊబిలో ముంచారు. అందుకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్థిక పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను ప్రజల ముందు పెట్టాం.

👉 ఉద్యోగులకు వాయిదాల పద్ధతిలో జీతాలు చెల్లించే పరిస్థితి. మొదటి తారీఖున జీతం ఇవ్వకపోతే ఉద్యోగులకు యజమానిపై భరోసా ఉండదు. కష్టమైనా సరే మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం.

👉 తెలంగాణ 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలనే నంబర్ 1గా నిలిచింది. కాళేశ్వరం నుంచి చుక్కనీరు వాడకుండా ఈ ఉత్పత్తి సాధించారు” అని ముఖ్యమంత్రి  తెలిపారు.

👉 “జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి వస్తుందని పదవీ విరమణ వయసు పెంచారు. తద్వారా ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి మరో వెయ్యి కోట్లు భారం పడింది. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ అన్నింటిలోనూ అప్పులు చేశారు.

👉 అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాట పట్టించాం. ₹11 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా వెయ్యి బస్సులను మహిళా సంఘాలకు అప్పగించి యజమానులను చేశాం. జిల్లాల్లో మహిళా సంఘాలకు భవనాలు నిర్మిస్తున్నాం.

👉 అనేక మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నదే ఉద్యోగాల కోసం. ప్రజాప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసింది” అని చెప్పారు.

👉 “కొన్ని విషయాలు మాట్లాడొద్దని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ ఉన్నది ఉన్నట్టు చెబుతా. ఏం ఉన్నదో అదే చెప్తా. చేసేదే చెప్తా. చెప్పిందే చేస్తా. కుండబద్ధలు కొట్టినట్టు చెబుతా. మాట మాట్లాడితే దానిపై నిలబడుతా. అబద్ధాల పునాదులపై ఈ ప్రభుత్వాన్ని నడపలేం” ముఖ్యమంత్రి  నిర్మొహమాటంగా చెప్పారు.

👉 ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులను అప్రమత్తం చేశారు. “కాలాలు మారుతున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. అందుకే పంట మార్పిడి చేయాలని చెబుతున్నాం. రైతుల కష్టాలేంటో తెలిసిన వాళ్లం. అందుకే అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. కొందరు దాన్ని కూడా తప్పుబడుతున్నారు” అని అన్నారు.

👉 “కుదుటపడేందుకు కొంత సమయం పడుతుంది. 30 నెలలు కష్టపడి పరిస్థితులను ఒక కొలిక్కి తెచ్చాం. ఈ ప్రభుత్వం ప్రజలది. మహిళలది. నిరుద్యోగ యువకులది. రైతులది. దీనికి కంచె వేసి కాపాడుకునే బాధ్యత రైతులది” అని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా రైతులకు ముఖ్యమంత్రి  శుభాకాంక్షలు తెలిపారు.

👉 సీఎంను కలిసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ !1

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ  జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.

  1. ↩︎