👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ప్రతి ఖాళీని భర్తీ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు.
👉 దేశ స్వాతంత్య్ర దినోత్సవం శుభసందర్భంగా ముఖ్యమంత్రి సంగారెడ్డి పట్టణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు, ప్రధానంగా రైతులు, మహిళలు, యువత ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
👉 పేదవారు ఆకలిలో అలమటించరాదని, ఎవరి ముందు చేయి చాచి నిలబడాల్సిన అవసరం లేదన్న సంకల్పంతోనే దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనప్పటికీ తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేపట్టామని గుర్తుచేశారు.
👉 దేశంలో రేషన్ షాపుల వ్యవస్థను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొంటూ హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.

👉 నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాత మార్కెట్‌లో వాటి ధర 10 నుంచి 15 రూపాయలు తగ్గిందన్నారు. వ్యవసాయం దండగ కాదు. పండుగ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ₹1.70 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు చేశామని చెప్పారు.
👉 “గడిచిన 32 నెలల కాలంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ₹ 90 వేల కోట్లు చెల్లించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం. ₹ 21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి 25 లక్షల మంది రైతులను అప్పుల నుంచి విముక్తి చేశాం. దేశంలోనే అతితక్కువ అప్పులున్నది తెలంగాణ రైతాంగం అని కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి.

👉 రైతు భరోసా ఎకరాకు ₹ 12 వేలు పెంచి ₹ 36 వేల కోట్లు రైతు భరోసా కింద అందించాం. ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేశాం. రైతులను రాజులా గౌరవించే సంస్కృతి మా ప్రభుత్వానిది.
👉 ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళా ప్రభుత్వం. కోటి మంది కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే ₹60 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ ఇచ్చాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ₹ 11 వేల కోట్లు చెల్లించాం.

👉 రాష్ట్రంలో 27 లక్షల మంది బడిపిల్లలకు అవసరమైన స్కూల్ డ్రెస్సులు కుట్టించే పనిని మహిళా సంఘాలకే అప్పగించాం. తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మహిళలకు కేటాయించాం. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇండ్లను కేటాయించాం.
👉 రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది. అలాగే, చేనేత కార్మికులు, గీత కార్మికులు, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల బారిన పడిన వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలి.
👉 కొందరు నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఉన్నవీ లేనివీ చెప్పే వారి మాయలో పడకండి. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ మధ్య కాలంలో మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశాం. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది. ఏ ఖాళీలను గాలికి వదిలేయం. పోటీ పరీక్షలకు సిద్ధం కండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాది.

👉 గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, తప్పులకు వడ్డీ కడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. ప్రతి ఏటా ₹ 75 వేల కోట్లు అప్పులకు చెల్లిస్తున్నాం. సంక్షోభంలో ఉన్న సంక్షేమాన్ని గాడిలో పెట్టి అమలు చేస్తున్నాం.
👉 ప్రజలకు కావలసిన మంచి పరిపాలన అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకు ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజల ఆశీర్వాదముంటే సాధించలేనిది ఏదీ లేదు. మీకు ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం” అని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.
