ప్రభుత్వ ప్రతి విజయంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రెండున్నరేండ్లలో ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

👉 ఇక ముందు కూడా భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం” అని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు.


👉 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి  గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.


👉 నిరుపేదల ఆర్థిక పురోగతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఒక స్పష్టమైన దార్శనికతతో విధ్వంసమైన తెలంగాణను పకడ్బంధీ ప్రణాళికలతో వికాసంవైపు నడిపించడానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి  తన సందేశంలో సమగ్రంగా వివరించారు.


👉 “గడిచిన 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో నాలుగు కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేసింది. సాధించిన విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్-2047.


👉 ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోంది. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26లో మన రాష్ట్ర తలసరి ఆదాయం ₹ 4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటిచెప్పే గొప్ప విజయం ఇది.


👉 మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో, ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది. పేదవాడి పట్ల బాధ్యత ఉంది. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది. వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం ఉంది. ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం ఉంది. ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉంది.


👉 రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్‌ను దాటేసింది. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.


👉 కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడేది లేదు. అటు తుమ్మడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.


👉 తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం ఓ విప్లవాత్మక పథకం. మనిషిని మనిషిగా గుర్తించి, ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పథకం. సన్నబియ్యంతో బువ్వ తినడం మా హక్కు అని నమ్మకం కలిగించిన పథకం.


👉 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చాం. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇచ్చింది.15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నాం. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతున్నాం.


👉 పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నాం. తొలి దశలో4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నాం.


👉 పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజా ప్రభుత్వం ఆమోదించింది. సుమారు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కల్పించాం. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమల్లోకి తెచ్చాం.


👉 విద్యారంగంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుంది.


👉 తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ప్రజా ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వశాఖల్లో 72 వేలకుపైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలు విజయవంతంగా నిర్వహించాం.


👉 నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాం. టీజీపీఎస్‌సి ద్వారా 456 వివిధ పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 7437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం.


👉 ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. గోషామహల్‌లో రెండువేల పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాం. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం. 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. 8 మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలను నిర్మిస్తున్నాం. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించాం.


👉 డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నాం. డ్రగ్స్ ముప్ప్పు, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. టీజీ సేఫ్ ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నాం. ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం.


👉 ప్రజా ప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం నుంచి సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు… పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాల్లో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం కీలకం.


👉 ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కరించడానికి ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రజావాణి ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించి ఎక్కడినుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం.


👉 తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోంది. అందుకే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ మొదలు పెట్టాం. ప్రజా పాలనలో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగింది.


👉 బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్‌లో బిజినెస్ ఎంట్రీ, కన్‌స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెబుతాం.


👉 ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళుతోంది. 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయి. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయి. హైదరాబాద్‌లో ఇప్పుడు 355కి పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. 2026లో కొత్తగా 40 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కు వచ్చాయి.


👉 డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించింది. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వెల్లి ప్రాంతాల్లో దేశంలోని అతిపెద్ద హైపర్‌స్కేల్, ఏఐ-రెడీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఒకటి రూపుదిద్దుకుంటోంది.


👉 భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. మూసీ పరీవాహకన ప్రాంత ప్రజలు పెద్దమనసులో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి నష్టం, కష్టం రానివ్వం.


👉 ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. దైవం ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు తోడైతే మరిన్ని విజయాలు సాధిస్తాం..” అని ముఖ్యమంత్రి  సవివరమైన సందేశమిచ్చారు.