👉 అటవీ భూముల అడ్రస్ ఎక్కడ..? రికార్డులు ఏమయ్యాయి ?
👉 ధరణిని అడ్డుపెట్టుకొని అక్రమాలా..? సమగ్ర విచారణకు డిమాండ్ !
👉 పర్యావరణ పరిరక్షణకు గండి కొడుతున్న అధికారుల నిర్లక్ష్యమా ?
J.SURENDER KUMAR,
👉 పార్ట్ – 1
జగిత్యాల జిల్లా ధర్మపురి అటవీ రేంజ్ పరిధిలో వందలాది ఎకరాల అటవీ భూములకు సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చని అడవులు విస్తరించి ఉండాల్సిన భూముల్లో కొందరి పేర్లపై పట్టేదారు పాస్‌పుస్తకాలు జారీ అయినట్లు ప్రచారం జరుగుతుండగా, ఈ వ్యవహారంపై సంబంధిత అటవీ, రెవెన్యూ శాఖలు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
👉 అటవీ శాఖ భూములు దేశ సంపదగా, పర్యావరణ సమతుల్యతకు మూలాధారంగా భావిస్తారు. అలాంటి భూములు రికార్డుల్లో ఎలా మార్పులకు గురయ్యాయి ? ఆ భూముల అసలు హద్దులు, సర్వే వివరాలు, ప్రభుత్వ రికార్డులు, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంబంధిత శాఖలు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.
👉 ధరణి వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత భూముల నమోదులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినా,….. కొందరు అదే వ్యవస్థను ఆసరాగా చేసుకొని అక్రమాలకు పాల్పడి ఉంటే, అది అత్యంత ఆందోళనకరమైన అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
👉 ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగి ఉంటే వాటికి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
👉 అటవీ శాఖ మౌనం ఎందుకు..?

చిన్న స్థలాల విషయంలో సైతం అటవీ శాఖ కఠిన వైఖరి అవలంబిస్తూ, అటవీ క్లియరెన్స్ పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేసే అధికారులు, తమ శాఖకు చెందిన వందలాది ఎకరాల భూములపై ఆరోపణలు వస్తున్నప్పటికీ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖ వద్ద ఉండాల్సిన భూమి రికార్డులు, మ్యాపులు, సరిహద్దుల వివరాలపై పూర్తి సమాచారం వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.
👉 రోళ్ళవాగు ప్రాజెక్టుకు అభ్యంతరాలు… ఇక్కడ మాత్రం నిశ్శబ్దమా..?
బీర్‌పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణంలో అటవీ భూమి ముంపు అంశాన్ని ప్రస్తావిస్తూ అనుమతుల ప్రక్రియలో అటవీ శాఖ అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వేలాది ఎకరాల ఆయకట్టు రైతులు, మత్స్యకారులు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అలాంటి శాఖే ఇప్పుడు తన భూములపై వస్తున్న ఆరోపణల విషయంలో మౌనం పాటించడం చర్చనీయాంశమైంది.
👉 పర్యావరణ పరిరక్షణకు ముప్పు !
అటవీ భూములు తగ్గిపోతే కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు, జీవవైవిధ్యం, వర్షపాతం, భూగర్భ జలాలు, వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతింటాయి. అడవులు ఆక్రమణలకు గురికావడం వల్ల భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అటవీ భూములను రక్షించడం ప్రతి ప్రభుత్వ శాఖతో పాటు సమాజం మొత్తం బాధ్యత అని వారు పేర్కొంటున్నారు.
👉 విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలి !
మంథని రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిగా ధర్మపురి మండలంలో అటవీ శాఖకు కేటాయించిన భూములకు సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వులు, సర్వే వివరాలు, ప్రస్తుతం ఆ భూముల స్థితిగతులపై జిల్లా స్థాయి లేదా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తేనే ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
👉 మరో కథనంలో వివరాలు….
