👉 సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ట్రాన్స్‌జెండర్ల భావోద్వేగ కృతజ్ఞతలు !
👉 కో-ఆప్షన్ సభ్యుల అవకాశంతో రాజకీయ సాధికారతకు కొత్త అధ్యాయం !
J.SURENDER KUMAR,
అనేక సంవత్సరాలుగా సమాజంలో గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ట్రాన్స్‌జెండర్ సమాజానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశలను నింపింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా పాలనలో భాగస్వాములుగా నిలిచే అవకాశం కల్పిస్తూ స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సుమారు 25 మంది ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు, ట్రాన్స్ ఉమెన్ హక్కుల ఉద్యమకారులు, ట్రాన్స్ మెన్ ప్రతినిధులు, ట్రాన్స్ హిజ్రా సంస్కృతి గురువులు, వివిధ సంఘాల నాయకులు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
👉 ఈ సందర్భంగా ప్రతినిధులు భావోద్వేగంగా స్పందిస్తూ,

“ఇప్పటి వరకు మమ్మల్ని సహాయం పొందే వారిగా మాత్రమే చూశారు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇది మా జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది” అని పేర్కొన్నారు. తమకు లభించిన ఈ గౌరవాన్ని సమాజ సేవకు వినియోగిస్తామని, స్థానిక సంస్థల అభివృద్ధిలో బాధ్యతాయుతంగా పనిచేస్తామని తెలిపారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,…

మానవత్వం మాటల్లో కాదు… అవకాశాల్లో కనిపించాలి. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ సమాజానికి రాజకీయ సాధికారత కల్పించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం” అన్నారు.
👉 ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా పాలనలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించడం ద్వారా గ్రామాలు, మండలాలు, పట్టణాల అభివృద్ధిలో వారి స్వరం వినిపించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. డ్రైవింగ్, కుకింగ్, డ్రోన్ నిర్వహణ వంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, మెట్రో స్టేషన్లలో ఉపాధి అవకాశాలు, ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వామ్యం వంటి చర్యల ద్వారా గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
👉 ఇప్పుడు రాజకీయ సాధికారతకు కూడా శ్రీకారం చుడుతున్నాం. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావడం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ సమావేశం ప్రభుత్వ నిర్ణయం ఒక పరిపాలనా ఉత్తర్వు మాత్రమే కాకుండా, ఎన్నాళ్లుగానో గుర్తింపు కోసం ఎదురు చూసిన ఓ వర్గానికి గౌరవం, సమానత్వం, ఆత్మవిశ్వాసాన్ని అందించిన మానవీయ అడుగుగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
