మహిళా కార్యాలయ భవనంకు స్థలం కేటాయిస్తాను !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

  J.SURENDER KUMAR,

రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం పక్కన వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించారు.

👉 ఫిక్కీ ఎఫ్ఎల్‌వో ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (FICCI) ఏర్పడి 2027 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు.


👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ….


మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హైటెక్ సిటీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సీఐఐ కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.

👉 ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీటీ కూడా ఫిక్కీ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి  కోరారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్ 500 కంపెనీలను నెలకొల్పాలన్నది ప్రభుత్వ సంకల్పమని, ఫిక్కీ మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కూడా చాలా కీలకమవుతుందని చెప్పారు.

👉 ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మహిళా సాధికారత కోసం మరొక పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు.

👉 మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు. వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అవార్డులు బహూకరించి గౌరవించాలని ముఖ్యమంత్రి  సూచించారు.

👉 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు , ఎఫ్ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్ , ఎఫ్ఎల్‌వో హైదరాబాద్ చైర్‌పర్సన్‌ సీతా రెడ్డి గడ్డంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.