👉 సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు !
👉 విద్యార్థులతో మమేకమైన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సంక్షేమం అంటే కేవలం పథకాలు ప్రకటించడం మాత్రమే కాదని, అవసరమైన వారిని స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరోసారి చాటిచెప్పారు. నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను మంత్రి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయడం ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది.
తనిఖీ సందర్భంగా మూగ–చెవిటి విద్యార్థులతో సంకేత భాష ద్వారా మమేకమై వారి సమస్యలను ఓర్పుగా ఆలకించిన మంత్రి, ప్రతి దివ్యాంగ విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, అవసరమైన అన్ని సౌకర్యాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
👉 విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం వినడానికే పరిమితం కాకుండా, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపాలు, విద్యా అవసరాలకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి వెంటనే పంపాలని సహాయ సంచాలకుడు, ప్రిన్సిపాల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

👉 ఖాళీ పోస్టుల భర్తీ, బోధనా సిబ్బంది నియామకం, అవసరమైన వసతుల కల్పనలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, భద్రత, తరగతి గదులు, బోధన సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
👉 దివ్యాంగ విద్యార్థుల విషయంలో విద్య – ఆరోగ్యం – మౌలిక సదుపాయాలు అనే మూడు అంశాలకే అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని మంత్రి పేర్కొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల సమర్థ అమలు ద్వారా ప్రతి దివ్యాంగుడి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
👉 దివ్యాంగుల సమస్యలను అధికార యంత్రాంగం కేవలం పరిపాలనా అంశాలుగా కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని, ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

👉 ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. మంత్రి ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో ఆయన చూపిన ఆత్మీయత, సమస్యల పరిష్కారానికి ఇచ్చిన తక్షణ ఆదేశాలు దివ్యాంగుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని, మానవీయ పాలనను ప్రతిబింబిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
