డ్రగ్స్ రహిత సమాజమే దేశ అభివృద్ధికి పునాది!

👉 వికసిత్ భారత్‌కు గుర్తింపు – నషా ముక్త్ భారత్ అభియాన్ విజయవంతం కావాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J . SURENDER KUMAR,

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే దేశ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మిషన్ పరివర్తన్  ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో నిర్వహించిన “నషా ముక్త్ భారత్ అభియాన్ – వికసిత్ భారత్ కి పహచాన్”  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత ఆరోగ్యవంతంగా, బాధ్యతాయుతంగా ఎదిగితేనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే మహమ్మారిగా మారుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

👉 డ్రగ్స్‌కు దూరంగా ఉండి క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై యువత దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ వారితో స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు.

👉 పాఠశాలలు, కళాశాలలు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి విద్యాసంస్థ డ్రగ్స్ రహిత ప్రాంతంగా మారేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని సామాజిక సమస్యగా భావించి సమిష్టిగా ఎదుర్కోవాలని మంత్రి అన్నారు.

👉 ప్రభుత్వం చేపడుతున్న నషా ముక్త్ భారత్ అభియాన్‌కు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
యువత తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. వ్యసనాలకు బానిస కాకుండా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు.

👉 ఈ సందర్భంగా  కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..


మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. యువతలో చైతన్యం పెంపొందించడం ద్వారా డ్రగ్స్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి యువతను సరైన దారిలో నడిపించాలని సూచించారు.

విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని అన్నారు. ప్రతి విద్యాసంస్థలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

👉 ఈ సందర్భంగా  ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ…

డ్రగ్స్ వల్ల వ్యక్తి మాత్రమే కాదు కుటుంబం, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతుందని అన్నారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేకంగా డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటుందని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత జిల్లా నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లు, సందేశాలు ప్రదర్శించారు. విద్యార్థులు,యువత ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగన భట్ల దినేష్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి (డిడబ్ల్యుఓ) భాస్కర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.