👉 సామాజిక న్యాయ సాధనకు ప్రభుత్వం మరో ముందడుగు !
👉 ఎస్సీ వర్గీకరణ – రోహిత్ వేముల బిల్లుపై కీలక కమిటీల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు స్థానం !
J.SURENDER KUMAR,
దశాబ్దాలుగా విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో సముచిత వాటా కోసం ఎదురుచూస్తున్న దళిత వర్గాల ఆకాంక్షలకు కొత్త ఊపిరినిచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ఎస్సీ వర్గీకరణ అమలు, ఉన్నత విద్యాసంస్థల్లో వివక్ష నిరోధానికి రూపొందిస్తున్న రోహిత్ వేముల బిల్లుపై ఏర్పాటైన అత్యంత కీలక కమిటీల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం.1077 ఈ నెల 23 న జీవో జారీ చేసింది.

👉 ఈ నిర్ణయం ….
కేవలం ఒక మంత్రి నియామకమే కాకుండా, అణగారిన వర్గాల అనుభవాలు, సమస్యలు, ఆశయాలకు ప్రభుత్వ నిర్ణయాల్లో సముచిత స్థానం కల్పించాలన్న ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
👉 సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో..
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీలో మంత్రి అడ్లూరికి సభ్యత్వం కల్పించారు. వర్గీకరణ ద్వారా అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపవర్గాలకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో న్యాయమైన వాటా దక్కేలా మార్గదర్శక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.
అదే విధంగా, ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షను అరికట్టే లక్ష్యంతో రూపొందిస్తున్న రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నిరోధక) బిల్లు–2026 రూపకల్పనపై సూచనలు అందించే కేబినెట్ సబ్ కమిటీలోనూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సభ్యత్వం కల్పించారు. విద్యార్థులు భయం లేకుండా, వివక్షకు తావులేకుండా విద్యను అభ్యసించే వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది బలమైన సంకేతంగా భావిస్తున్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల అమలుకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణలో అన్ని వర్గాల అభిప్రాయాలను గౌరవిస్తూ రాజ్యాంగబద్ధమైన, న్యాయసమ్మతమైన సిఫారసులు అందించేందుకు కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. అలాగే, రోహిత్ వేముల బిల్లును దేశానికే ఆదర్శంగా నిలిచే చట్టంగా రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం కేవలం నినాదంగా కాకుండా, పాలనలో ఆచరణగా మారాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ రెండు కీలక కమిటీల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించడం ఆ దిశలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని దళిత సంఘాలు, సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
