👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఈనాటి పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించే విషయంలో ప్రజా ప్రభుత్వం స్పష్టమైన బాధ్యతతో పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణ, ప్రయోజకులైన దేశ పౌరులుగా ఎదుగుతారని అన్నారు.
👉 హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం బాలామృతం ఉత్పత్తి, ప్యాకింగ్ ప్రాసెస్ యూనిట్‌ను పరిశీలించారు. పరిసరాల్లో మొక్కను నాటారు.

👉 ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
👉 ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల్లో ఆనందం ఉంటుంది. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు ఆరు సంవత్సరాల వరకు బలవర్థకమైన పోషకాహారం పేద పిల్లలకు ఇవ్వాలనే ఈ నూతన బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాం.

👉 పిల్లలు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, ఇలాంటి సంస్థలు రావాలి. ప్రభుత్వం వైపు నుండి అన్ని విధాల సహకారం అందిస్తాం. పిల్లల భవిష్యత్తే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. పేద పిల్లల ఆరోగ్యం, చదువు పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లలకు నాణ్యమైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.
👉 గతంలో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మహబూబ్‌నగర్ లో ఈ కేంద్రాన్ని ప్రారంభించగా, అంచెలంచెలుగా ఇక్కడ 21 ఎకరాల్లో పెద్ద పరిశ్రమగా విస్తరించిందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మరో నాలుగైదు రాష్ట్రాలకు పౌష్టికాహారం అందించే సామర్థ్యం సాధించిందన్నారు.
👉 గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విధానం లేదు. పట్టణాల్లో వలస వచ్చిన వారి పిల్లలు చదువుకోవాలంటే, ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. పేదలు తాము సంపాదించిందంతా పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.

👉 పేదల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వ బడుల్లో నర్సరీ నుండి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్ అందించే కార్యక్రమం ప్రారంభించాం. విద్య రంగంపై ప్రతి ఏటా ₹ 27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ ఖర్చును ఖర్చుగా భావించడం లేదని భవిష్యత్తును తీర్చిదిద్దే పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పారు.
👉 ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ ఆడబిడ్డల పేరిటే ఇస్తున్నామని వాటి వివరాలను తెలిపారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాలకు రుణాలు, వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ బంకులు, అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి ఇవ్వడానికి వెయ్యి బస్సులు, శిల్పారామం వద్ద మూడున్నర ఎకరాల స్థలంలో ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వివరించారు.
👉 హైదరాబాద్ నగరంలో భూముల ధరలు వజ్రాల ధర పలుకుతున్న పరిస్థితుల్లో నిరుపేదల కోసం లక్ష ఇండ్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు వ్యాపార రంగంలో విస్తరించడానికి అన్ని రకాల ప్రణాళికలతో ముందుకు వెళుతామని చెప్పారు.
