పరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అవసరమైన మేరకు చట్టాలను రూపొందించాలని చెప్పారు.

👉 రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి  ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా డిజిటల్ గవర్నెన్స్ (Digital Governance) అమలు చేయాలని సూచించారు.

👉 ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేది న జీతాలు అందించేలా వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టంగా చెప్పారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు.

👉 రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి  దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు.

👉 ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌తో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని సూచించారు.

👉 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు.

👉 ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగినప్పటికీ సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

👉 దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి  సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు.

👉 హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

👉 ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి , సలహాదారు కె. రామకృష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.