పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం CSR నిధులు!

👉 సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇచ్చిన దివీస్, అరబిందో ఫార్మా కంపెనీల ప్రతినిధులు !


J.SURENDER KUMAR,


ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సమక్షంలో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను అందించాయి.

👉 ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, దివీస్, అరబిందో ఫార్మా కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం సీఎస్‌ఆర్‌ నిధుల కింద దివీస్ సంస్థ  ₹ 12.18 కోట్లు, అరబిందో ఫార్మా  ₹ 10 కోట్లకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి  సమక్షంలో ఫౌండేషన్‌కు అందజేశారు.

👉 ప్రభుత్వ పాఠశాలల్లో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకం కోసం సీఎస్ఆర్ నిధులను అందించిన దివీస్‌, అరబిందో సంస్థలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  అభినందించారు.

👉 ఆ పథకం అమలు కోసం హరే కృష్ణ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌లను ఏర్పాటు చేసిన చోట సమీప ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రతినిధులకు వివరించారు. అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి తీసుకునేలా, రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

👉 రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతులకు లాభాలను అందించవచ్చని ముఖ్యమంత్రి  అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె రామకృష్ణారావు , సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ , హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ , దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు , అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.