👉 దేశసేవే లక్ష్యం అబుదాబి నుంచి రప్పించండి !
👉 తల్లి సుమలత ఆవేదన !
👉 అగ్నివీర్ ఎంపికకు అవకాశం… కానీ అబుదాబిలో చిక్కుకున్న యువకుడు !
👉 సీఎం ‘ప్రవాసీ ప్రజావాణి’లో వినతి స్పందించిన అధికారులు !
J SURENDER KUMAR,
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనే ఓ యువకుడి కల, ఆ కలను నిజం చేయాలని తల్లి చేస్తున్న పోరాటం సమాజానికి దేశభక్తి, త్యాగం, మాతృప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని అభిలాష్‌ను స్వదేశానికి రప్పిస్తే, మరో యువకుడు భారత త్రివర్ణ పతాకం కింద దేశసేవ చేసే అవకాశం పొందనున్నాడు. దేశం కోసం తుపాకీ పట్టి సరిహద్దుల్లో సేవ చేయాలనే కొడుకు కల, ఆ కలను నిజం చేయాలని తపించే ఓ తల్లి ఆశయం ప్రస్తుతం అందరినీ కదిలిస్తోంది.
👉 వివరాలలోకి వెళితే…
ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన కొపర్తి అభిలాష్ భారత సైన్యంలో అగ్నివీర్గా చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సిద్ధమయ్యాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉపాధి కోసం ఇటీవల అబుదాబికి వెళ్లాల్సి వచ్చింది.

జగిత్యాలలోని లైసెన్సు కలిగిన ఒక గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై ఈ నెల 8న ముంబయి నుంచి అబుదాబి కి వెళ్లారు. అనంతరం ఈ నెల 13న అతనికి అక్కడ ఎంప్లాయిమెంట్ వీసా జారీ అయింది.

ఇదే సమయంలో ఈ నెల 14న భారత సైన్యం నిర్వహిస్తున్న అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఫిజికల్ స్క్రీనింగ్‌కు ఎంపికైనట్లు ఇ-మెయిల్ రావడంతో అతని జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం 4,100 యూఏఈ దిర్హాములు (సుమారు ₹.1.08 లక్షలు) జరిమానా చెల్లించి వీసా రద్దు చేస్తేనే భారత్‌కు పంపిస్తామని షరతు విధించడం ఆ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

దీంతో అభిలాష్ తల్లి సుమలత శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. “నా కొడుకు ఉద్యోగం కోసం కాదు… భారత మాత సేవ కోసం సైన్యంలో చేరాలనుకుంటున్నాడు. అతని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని అబుదాబి నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలి” అని ఆమె భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.

ఈవినతిపై స్పందించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్, పేద కుటుంబానికి చెందిన ఈ యువకుడికి తక్షణ సహాయం అందించి స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి బాధిత కుటుంబానికి అవసరమైన మార్గదర్శనం అందించారు.
