👉 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
👉 శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రుల ప్రత్యేక పూజలు !
J.SURENDER KUMAR,
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ లో గురువారం పర్యటించిన మంత్రులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
మంత్రులకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ కుమార్ లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.

అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూలై 30వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.

అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు యాగశాలలో వరుణయాగాన్ని అధికారికంగా ప్రారంభించారు. భీమేశ్వర సదన్‌లోని ఈశాన్య మూలలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శాలువాలతో మంత్రులను సత్కరించి ఆహ్వానించారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్క్ ను మంత్రులు తుమ్మల, నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్, మేడిపల్లి సత్యంలతో కలిసి ప్రారంభించారు. వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులను ప్రారంభించిన మంత్రులు వేములవాడ నుంచి బాసరకు నూతన బస్ సర్వీస్ను మంత్రులు ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ,….
వరుణయాగం అనేది కేవలం ఆధ్యాత్మిక క్రతువే కాకుండా లోకకళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే మహోన్నత వైదిక సంప్రదాయమని పేర్కొన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడం ద్వారా చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండుతాయని తెలిపారు.

సమృద్ధిగా వర్షాలు కురిస్తే రైతులు ఆర్థికంగా బలోపేతం అవడంతో పాటు రాష్ట్రం వ్యవసాయరంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని, ప్రజలకు తాగునీటి సమస్యలు తీరడంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా నెలకొంటుందని అన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, తెలంగాణ సస్యశ్యామలంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ఈ వరుణయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.
