ధర్మపురి పట్టణ  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి !

👉 మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి !


J SURENDER KUMAR,


భారీ వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో పట్టణ
ప్రజలు  వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగలు స్తంభాలకు దూరంగా ఉండాలని,శిథిలా వ్యవస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగంతో బుధవారం చైర్ పర్సన్ పట్టణంలో పర్యటించారు. వర్షాల కారణంగా ధర్మపురి పట్టణంలోని 10వ వార్డులో కూలిన చిపిరిశెట్టి గంగారాం ఇంటిని ఆమె పరిశీలించారు.


అనంతరం 14వ వార్డులోని న్యూ టీటీడీ వసతి గృహం సమీపంలో విద్యుత్ వైర్లకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.


👉 గోదావరి పరివాహక ప్రాంతాన్ని….


ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో  చైర్‌పర్సన్  గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు.


హనుమాన్ గడ్డ, మంగలి ఘాట్, సంతోషిమాత ఆలయం పరిసర ప్రాంతాల్లో గోదావరి ప్రవాహ పరిస్థితులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. భక్తులు  గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

వరద ఉద్ధృతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ఘాట్‌ల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే భక్తులను నదిలోకి దిగకుండా అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు చైర్ పర్సన్ నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు.


👉 ఇంకుడు గుంతల ఏర్పాటుతోనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత !

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశాలమేరకు ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో “క్యాచ్ ది రైన్ – 2026” ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి  రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంతల(పిట్ )నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్  వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ…..


ప్రతి ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాల్లో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించుకోవాలని సూచించారు.
వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత లేకుండా చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం మున్సిపల్ మేనేజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, వర్షపు నీటి సంరక్షణ అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, స్థానిక మహిళలు, ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.