విద్యా సంస్థలలో డ్రగ్స్  సంఘటన ఏది జరిగిన…

👉 యాజమాన్యందే బాధ్యత !


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సూచించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో మాదక ద్రవ్యాలకు సంబంధించి జరిగే ఏ ఘటననైనా యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని చెప్పారు.

👉 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి తీసుకునే చర్యల్లో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అవసరమైతే ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి  సూచించారు.

👉 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో ముఖ్యమంత్రి  పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.

👉 విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్ మహమ్మారిని నిరోధంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి క్యాంపస్ బయట జరిగే కార్యకలాపాలను సైతం గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు.

👉 డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, వాటిని నిరోధంలో విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతలను కూడా అప్పగించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు.

👉 మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్‌ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు.

👉 డ్రగ్స్‌కు సంబంధించి కార్యకలాపాలను గుర్తించడం, వినియోగిస్తున్న వారిని మాన్పించడం, శిక్షించడం అన్న మూడు దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించడం, కౌన్సిలింగ్ ఇప్పించడమే కాకుండా తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.

👉 ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి , కె రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.