ఎల్లంపల్లి జలకళతో బిఆర్ఎస్ వాదనలకు చెక్..!

👉 కాంగ్రెస్ దూరదృష్టితో నిర్మించిన ప్రాజెక్టుల ఫలితమే నేటి నీటి లభ్యత :

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,


శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద జలాలతో నిండిపోవడం తెలంగాణ సాగునీటి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ దూరదృష్టికి నిదర్శనంగా ప్రస్తావిస్తుండగా, బీఆర్ఎస్ గతంలో చేసిన ఆరోపణలు ప్రజల ముందే తేలిపోయాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

👉 హైదరాబాదు లో సీఎల్పీ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూపొందించిన గ్రావిటీ ఆధారిత వరద కాలువల వల్లే ఎలాంటి పంపింగ్ అవసరం లేకుండా ఎల్లంపల్లికి నీరు చేరిందన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హంగామా చేశారని, ఎల్లంపల్లి జలాశయం నిండిపోవడంతో వారి వాదనలు పూర్తిగా నిరాధారమని  తేలిపోయాయని అన్నారు.


👉”మా వల్లే నీళ్లు వచ్చాయి” అంటూ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ నాయకుల మాటలకు ప్రకృతి స్వయంగా సమాధానం చెప్పిందని  అన్నారు. కేటీఆర్, హరీష్ రావు గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

👉 ప్రతిపక్షం ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి కరువు రావాలని కోరుకోవడం బాధ్యతారాహిత్య రాజకీయమని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టుల నాణ్యత ఇప్పటికీ నిలిచిందని, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చిన ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

👉 ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన బీఆర్ఎస్ ప్రజల కష్టసుఖాలను పక్కనపెట్టి రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు నష్టపోవాలని, ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకుంటోందని మంత్రి తీవ్రంగా విమర్శించారు.

👉 రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని ఆరోపించారు !

గతంలో “ఎల్‌నినో వల్ల కాదు… రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు” అంటూ నిరాధార ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా కురుస్తున్న వర్షాలపై ఏమి చెబుతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి భద్రత, వ్యవసాయాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, అందుకే ఉత్తర తెలంగాణలో ఈ ఏడాది విస్తారంగా సాగు జరుగుతోందని, అధిక వరి దిగుబడులకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయని పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రజలు కోరుకున్న అభివృద్ధి పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.