అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు గా ప్రజా ప్రభుత్వం కృషి !

👉  కరీంనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!


J.SURENDER KUMAR,

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అడ్లూరి స్వాతంత్ర్య సమర యోధులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రసంశ పత్రాలను అందజేశారు.

👉  ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థిని, విద్యార్థులకు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


👉 భారత స్వాతంత్య్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందామని స్వాతంత్ర్య సాధనకు పోరాడిన త్యాగధనుల అందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నమని మంత్రి తెలిపారు.


👉 ప్రజా పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించే అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు.


👉 9 డిసెంబర్‌ 2023న ప్రారంభించిన మహా లక్ష్మిపథకం మహిళలకు ₹ 366 కోట్ల 31 లక్షల రూపాయల లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు.


👉  జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 58 వేల లబ్దిదారులకు 9 లక్షల 23 వేల 755 గ్యాస్‌ సిలిండర్లను రూ. 500లకు సరఫరా చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ఇందుకు గాను 29 కోట్ల 78 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు.

👉 గృహజ్యోతి పథకం జిల్లాలో ఒక లక్షా 71 వేల 622 సర్వీసులకు గాను ఇప్పటివరకు రూ. 182 కోట్ల 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని మంత్రి వివరించారు.


👉 ‘‘రైతుభరోసా’’ పథకం ద్వారా ఈ వానాకాలం పంటకు గాను ఒక లక్షా 92 వేల 628 మంది రైతులకు ₹ 206 కోట్ల 82 లక్షల లను జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. సన్నరకం ధాన్యం విక్రయించిన 28 వేల 659 మంది రైతులకు ₹71 కోట్ల 17 లక్షల రూపాయల బోనస్ జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.


👉 జిల్లాలో మొదటి విడతలో 10 వేల 506 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికే 8 వేల 557 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గృహ నిర్మాణాన్ని బట్టి దశలవారీగా ప్రభుత్వం ₹222 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.


👉 స్వచ్చ భారత్ మిషన్ లో జిల్లాలో ఒక లక్ష 32 వేల 229 మంది లబ్దిదారులకు ప్రతి నెలా₹ 30 కోట్ల 60 లక్షల రూపాయల చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


👉 జిల్లాలో ఇప్పటి వరకు 47 వేల 138 కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయడం జరిగింది. 97 వేల 13 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో 3 లక్షల 22 వేల 198 కుటుంబాలకు గాను ప్రతి నెలా 6 వేల 63 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణి చేస్తున్నట్లు మంత్రి వివరించారు.


👉 రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలో జనవరి నుండి ఇప్పటి వరకు 14 వేల 932 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించడం జరిగిందని మంత్రి తెలిపారు. ₹ 42 కోట్ల 75 లక్షల రూపాయలను ప్రభుత్వం నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.


👉 ‘‘ఇందిరా మహిళా శక్తి’’ పథకం కింద 93యూనిట్లకు గానూ ₹2 కోట్ల 65 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 175 స్వయం సహాయక సంఘాలకు ₹ 26 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఒక వెయ్యి 706 మహిళా సంఘాలకు ₹165 కోట్ల 74 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు అందించినట్లు మంత్రి తెలిపారు.


👉 ఒక లక్ష 46వేల 610 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని ఈ ఆర్థిక సంవత్సరంలో 374 మహిళా సంఘాలకు స్వంత భవనాలు నిర్మించేందుకు అనుమతి మంజూరు చేశామని మంత్రి తెలిపారు.


👉 గత యాసంగి సీజన్‌లో 319 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 38 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఒక లక్ష 42 వేల 346 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు.
విబి-జి రామ్ జీ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 51 వేల 517 కుటుంబాలకు 17 లక్షల పని దినాలు కల్పించమని 41 కోట్ల 20 లక్షల రూపాయల వేతనాన్ని ప్రభుత్వం అందజేసిందని మంత్రి తెలిపారు.

👉 ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చొప్పదండిలో 37 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రాంతీయ వైద్యశాల నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని మానకొండూరులో ₹  17.5 కోట్ల రూపాయలతో 30 పడకల సామాజిక వైద్యశాల భవనం నిర్మాణ దశలో ఉందని ₹ 15 కోట్ల రూపాయలతో కొత్తపల్లిలో ఆయుష్ ఆసుపత్రి నూతన భవనం నిర్మించనున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 కొత్తపల్లి మెడికల్ కళాశాల ఆవరణలో రూ.26 కోట్లతో మూడెకరాల్లో నర్సింగ్ కళాశాల భవనం నిర్మాణం పూర్తి కావస్తున్నదని జిల్లా యంత్రాంగం సమన్వయంతో ₹ 2 కోట్ల 98 లక్షల సీ.ఎస్.ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్స్, వివిధ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.


👉 విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలను ప్రారంభించామని విదేశాల్లో విద్యా విధానం, బోధన పద్ధతులు అధ్యయనం చేసేందుకు జిల్లా నుండి ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు.


👉 షెడ్యూల్డ్‌ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తున్నాం. వీరికి ఉపకార వేతనాలు అందించడంతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నాం.

👉 మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, హాస్టల్లో 3 వేల 822 మంది విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 2 వేల 214 మంది విద్యార్థులకు అన్ని సదుపాయాలతో వసతి కల్పిస్తున్నామని గత విద్యా సంవత్సరం వసతి గృహాల్లో చదివిన పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమని మంత్రి వివరించారు.


👉 ఎస్సీ, స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 238 మంది ఉద్యోగాలు సాధించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 17 వేల 996 మంది విద్యార్థులకు ₹ 22 కోట్ల 82 లక్షల రూపాయల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందజేశామని మంత్రి వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం అమలుకు ₹50 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి వివరించారు.


👉 కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ₹840 కోట్ల యు.సి.ఎఫ్ నిధులు, ₹50 కోట్ల రూపాయల యు.ఐ.డి.ఎఫ్ నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టడడం జరిగిందని మంత్రి తెలిపారు. ₹ 158 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులతో నగరంలో సి.సి రోడ్లు, డ్రైన్, మంచినీటి పైప్ లైన్ వంటి పనులు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.


👉 రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్‌ రెడ్డి కి, జిల్లా సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న  పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు,  శాసన సభ్యులకు,  స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్‌ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.