👉 బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా ?
👉 హరీశ్‌రావు వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు.. ఆధారాలతో మాట్లాడాలి !
👉 మా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధం.. అసెంబ్లీకి రండి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ !
J.SURENDER KUMAR,
పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగుల సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలకు అధికారం కోల్పోయిన తర్వాతే దివ్యాంగులు గుర్తుకొచ్చారా ? అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రశ్నించారు. దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ మంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆయన తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదన్నారు.
👉 హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు….
👉 పదేళ్ల పాలనలో ఏం చేశారు ?
2014, 2018, ఎన్నికల మ్యానిఫెస్టోల్లో దివ్యాంగులకు బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో కేసీఆర్, హరీశ్‌రావులు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి, పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయాక దివ్యాంగుల సంక్షేమంపై మాట్లాడటం రాజకీయ అవకాశవాదమని విమర్శించారు.
👉 ₹ 50 కోట్లతో సహాయ పరికరాలు !
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి తెలిపారు. ₹ 50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్, ఇతర సహాయ పరికరాలను అందించామని చెప్పారు. వచ్చే ఏడాది మరో ₹50 కోట్లతో అవసరమైన పరికరాలు, సహాయ వాహనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
👉 ఇందిరమ్మ ఇళ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యం !
దివ్యాంగులకు గృహ భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఎన్ని ఇళ్లు నిర్మించారో కేటీఆర్, హరీశ్‌రావులు చెప్పాలని సవాల్ చేశారు.
👉 ₹ 6 వేల పింఛన్‌పై ప్రభుత్వం కట్టుబడి ఉంది !
కొత్తగా అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దివ్యాంగులకు ₹ 6,000 పింఛన్ అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వనరుల సమీకరణ కారణంగా పెంపులో కొంత ఆలస్యం జరుగుతోందని వివరించారు.!
👉 ‘బాల్ భరోసా’తో వైద్య సేవలు !
పూర్తి అంగవైకల్యంతో జన్మించే చిన్నారులకు అవసరమైన వైద్య సేవలను ‘బాల్ భరోసా’ పథకం ద్వారా ప్రభుత్వమే పూర్తి వ్యయంతో అందిస్తోందని మంత్రి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు.
👉 దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై చర్చలు !
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి దివ్యాంగులకు మరింత ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
👉 బీఆర్‌ఎస్ హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి !

నిరుద్యోగ భృతి, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వంటి హామీల అమలుపై కేసీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
👉 ప్రజా ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట !
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తోందని, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని మంత్రి తెలిపారు. విద్యా రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
👉 వెయ్యి రోజుల పాలనపై చర్చకు సిద్ధం !
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించడంపై మంత్రి స్పందిస్తూ.. తమ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
“వెయ్యి రోజుల వైఫల్యాలంటున్నారు.. అసెంబ్లీకి రండి. మీ పదేళ్ల పాలన, మా ప్రభుత్వ పాలనపై ప్రజల సమక్షంలో చర్చిద్దాం. దివ్యాంగుల కోసం మీరేం చేశారో చెప్పండి.. మా రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశామో మేము చెబుతాం” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సవాల్ చేశారు.
👉 దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని, దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
