అక్రమాల అడ్డుకట్టకే డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు!

👉 అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం !

👉 ధర్మపురి నియోజకవర్గంలో 80,873 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాము !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, పటిష్టంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యంతో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……

గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న నకిలీ, డూప్లికేట్ రేషన్ కార్డులను తొలగించి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో మొత్తం 80,873 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, గొల్లపల్లి మండలంలోని 34 రేషన్ షాపుల పరిధిలో 15,185 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు.

👉 ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను డిజిటల్ విధానంలో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

👉 రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ సరుకులు పొందేలా పోర్టబిలిటీ సౌకర్యం కల్పించామని, పేదలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

👉 అర్హులైన ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు రద్దు కాదని స్పష్టం చేశారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల జారీ, వివాహాల అనంతరం కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు వంటి ప్రక్రియలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మండలంలో సుమారు 17 వేల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

👉 ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో అర్హులైన లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹ 5 లక్షల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. త్వరలో రెండో విడత ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు.

👉 అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, 50 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, తలసేమియా, కిడ్నీ బాధితులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

👉 గొల్లపల్లి మండలంలోని నాలుగు గ్రామాల్లో తొలి విడతగా డిజిటల్ భూ ఆధార సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం భూ సరిహద్దులు, భూమి మ్యాప్‌తో కూడిన ‘భూ ఆధార’ కార్డులను రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. డిజిటల్ భూ సర్వే ద్వారా భూ వివరాలు మరింత స్పష్టంగా, పారదర్శకంగా నమోదు కావడంతో భూ వివాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో 80,873 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు గొల్లపల్లి మండలంలో 15,185 కుటుంబాలకు కార్డులు అందిస్తున్న నేపథ్యంలో, ప్రతి అర్హ కుటుంబానికి కార్డు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, ఎలాంటి జాప్యం లేకుండా అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. రేషన్ కార్డు భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రామాణిక పత్రంగా మారనుందని పేర్కొన్నారు.


👉 ప్రజల సౌకర్యార్థం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రేషన్ కార్డు నంబర్‌తో యాప్‌లో లాగిన్ అయి ప్రతి నెలా కేటాయించిన సరుకులు, పొందిన సరుకుల వివరాలను లబ్ధిదారులు స్వయంగా పరిశీలించుకోవచ్చన్నారు.


👉 రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే యాప్ ద్వారానే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడుతుందని తెలిపారు.


👉 డిజిటల్ విధానంతో రేషన్ కార్డుల వివరాలు అందుబాటులో ఉండటం వల్ల లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈకార్యక్రమంలో ఆర్డీఓ మధు సూదన్, డీఎస్ఓ జితేందర్ రెడ్డి, , ఎంఆర్ఓ మాజీద్ , ఏఎంసీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్, స్థానిక సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.