బ్యారేజీ ఎత్తు పెంపున‌కు అనుమ‌తులు ఇప్పించండి !

👉కేంద్ర జలశక్తి మంత్రి  సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి!


J SURENDER KUMAR,

ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  విజ్ఞ‌ప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మ‌హారాష్ట్రలో ముంపు ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని వివ‌రించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి , రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తో కలిసి జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి తో సమావేశమయ్యారు.

👉 తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్య‌త‌, ప్రాజెక్టుకు అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తాను రాసిన లేఖ‌, దానికి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం స్పందించి జ‌ల్‌శ‌క్తి శాఖకు పంపిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ప్ర‌స్తావించారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గ‌తంలోనే రెండు రాష్ట్రాల మ‌ధ్య ఒప్పందం కుదిరిన విష‌యాన్ని గుర్తు చేశారు. 148 మీట‌ర్ల నుంచి 152 మీట‌ర్ల వ‌ర‌కు ఎత్తుతో బ్యారేజీ నిర్మాణంపై పుణెలోని సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ సెంట‌ర్ (CWPRS) అధ్య‌య‌నం నిర్వ‌హించింద‌ని కేంద్ర మంత్రికి వివరించారు.


👉 CWPRS అధ్య‌య‌నం ప్రకారం 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీట‌ర్ల ఎత్తులో నిర్మించినా ముంపులో పెద్ద‌గా తేడా లేద‌ని స్ప‌ష్ట‌మైంద‌ని తెలిపారు. ముంపులో 50 శాతం న‌దీ గ‌ర్భం (రివ‌ర్ బెడ్‌)లోనే ఉంటుంద‌ని చెప్పారు. 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా అవ‌స‌ర‌మైన నీటి స‌ర‌ఫ‌రా సాధ్యం కాద‌ని, అందువ‌ల్ల 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ ని ముఖ్య‌మంత్రి  కోరారు.


👉 తుమ్మిడిహెట్టి వ‌ద్ద 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేప‌డితే గ్రావిటీ ద్వారా నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. గ్రావిటీ ద్వారా నీటి స‌ర‌ఫ‌రా వ‌ల్ల విద్యుత్ వినియోగ భారం త‌గ్గుతుంద‌ని వివ‌రిస్తూ, ఈ అంశంపై సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తెలంగాణ‌, మ‌హారాష్ట్రల మ‌ధ్య స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యితే వెనుక‌బ‌డిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి వ‌స‌తి ఏర్ప‌డుతుంద‌ని వివ‌రించారు.


👉 ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి లేఖ అందింద‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి  ముఖ్య‌మంత్రి కి తెలిపారు. ఈ అంశంపై మొద‌ట కేంద్ర జ‌ల సంఘం (సీడ‌బ్ల్యూసీ) ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటు చేసి తెలంగాణ‌, మ‌హారాష్ట్ర రాష్ట్ర స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అనంత‌రం తెలంగాణ‌, మ‌హారాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రుల స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని చెప్పారు.


👉 ఈ స‌మావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం న‌రేంద‌ర్ రెడ్డి , డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి , రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి , పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌ , గ‌డ్డం వంశీకృష్ణ‌, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌ , ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి , నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాధ్ దాస్ , నీటి పారుద‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఈ. శ్రీ‌ధ‌ర్ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు
.