తెలంగాణ ఫోటోగ్రాఫర్ ప్రతిభకు జాతీయ ముద్ర.!

👉 ధర్మపురి రిపోర్టర్ వడ్లూరి రవీందర్ కు
జాతీయ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు !

👉 కర్ణాటక మీడియా అకాడమీ జాతీయ పోటీల్లో అరుదైన ‘వుడెన్ టైప్ బట్టర్‌ఫ్లై’ చిత్రం ఉత్తమ ఫోటోగా ఎంపిక !

J.SURENDER KUMAR,

వార్తలను చెప్పడమే కాదు… ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతాలను కెమెరా కంటితో ప్రపంచానికి పరిచయం చేయడంలోనూ తెలంగాణకు చెందిన ఓ ఫోటో జర్నలిస్టు తన ప్రత్యేక ముద్ర వేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన టీవీ5 న్యూస్ ఛానల్ రిపోర్టర్ వడ్లూరి రవీందర్ ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డును అందుకుని రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ వేదికపై నిలబెట్టారు.

కర్ణాటక మీడియా అకాడమీ, కర్ణాటక సమాచార–పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “ఫోకస్ ఆన్ న్యూస్–2.0” నేషనల్ న్యూస్ ఫోటో జర్నలిజం పోటీలలో, రవీందర్ పంపిన అరుదైన “వుడెన్ టైప్ బట్టర్‌ఫ్లై” చిత్రం ఉత్తమ ఫోటోగా ఎంపిక కావడం విశేషం.

వేలాది ఎంట్రీల మధ్య ప్రకృతి అందాలను జీవంతోపి ఆవిష్కరించిన ఈ చిత్రం జ్యూరీని విశేషంగా ఆకట్టుకుంది.
బెంగళూరులోని చిత్రకళా పరిషత్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కర్ణాటక రాష్ట్ర మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ శాఖ మంత్రి రామలింగారెడ్డి, సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ బి.ఆర్. మమత, కర్ణాటక మీడియా అకాడమీ చైర్‌పర్సన్ ఆయేషా కానం రవీందర్‌కు మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

👉 ఫోటో జర్నలిజం అనేది కేవలం కెమెరా క్లిక్ కాదు !

సమాజాన్ని ఆలోచింపజేసే క్షణాలను శాశ్వతంగా నిలిపే కళ. ఆ కళలో నిబద్ధత, సహనం, పరిశీలన, ప్రకృతిపై ప్రేమ కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి జాతీయ గుర్తింపు సాధ్యమవుతుందని రవీందర్ మరోసారి నిరూపించారు.


గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు ఫోటోగ్రఫీ పోటీల్లోనూ అవార్డులు అందుకున్న రవీందర్, ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం యువ ఫోటో జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

ఈ అవార్డు వ్యక్తిగత విజయమే కాకుండా, జిల్లా స్థాయి జర్నలిస్టుల ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందనడానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు రవీందర్‌కు అభినందనలు తెలిపారు.