ఓటర్ల సవరణ లో అర్హత ఉన్న  పేరు పోవద్దు !

👉 అనర్హులైన ఓటరు  జాబితాలో చేరకూడదు !

👉 అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడగించాలి !

👉 భారత ఎన్నికల సంఘం  ప్రధాన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ !


J. SURENDER KUMAR,


తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్ కు ముఖ్యమంత్రి  లేఖ రాశారు.

👉 అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

👉 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా (ASDD) గుర్తించినట్లు ముఖ్యమంత్రి  ఈసీ గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

👉 మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయబడలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు.

ఎన్నికల సంఘానికి రాసిన లేఖ ( ఫైల్ ఫోటో)

👉 ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి  లేఖలో పేర్కొన్నారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు.

👉 నిజంగా నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా ఎలాంటి సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని తెలిపారు.

👉 దీనివల్ల ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

👉 హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని ముఖ్యమంత్రి  తెలిపారు.

👉ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

👉 సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించి, నిర్ణయించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 నుంచి సవరించాలని కోరారు.

👉 గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

👉 నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి  కోరారు.

👉 ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సూచించారు.

👉 ప్రభుత్వ ఉత్తర్వు (జీవో నంబర్ 172) ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి  తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని సూచించారు.

👉 హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున కేవలం కొంతమంది అధికారుల నియామకం సరిపోదని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించి, ముద్రిత నోటీసుల్లోనే నిర్దిష్ట తేదీలు, సమయాలను పేర్కొంటూ వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

👉 SIR ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  కోరారు.

👉 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు పరిపాలనా, ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.