కస్తూర్బా కళాశాలలో వసతుల పరిశీలించిన మంత్రి!

👉 సమస్యలను త్వరలో పరిష్కరిస్తా
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,


ధర్మపురి  నియోజకవర్గం పెగడపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి ముచ్చటించి, కళాశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ప్రధానంగా మరుగుదొడ్లు, స్టోర్ రూమ్, అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను సావధానంగా విన్న మంత్రి, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. కళాశాలలోని సమస్యలను పరిశీలించి, అవసరమైన నిధులు మరియు వసతులు సమకూర్చి విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

👉 మంత్రికి  రాఖి కట్టిన విద్యార్థినిలు !

విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు రాఖీ కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా మంత్రి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.