ఖేలో ఇండియా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

👉 ముఖ్యమంత్రి ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై మంగళవారం మంత్రి వాకిటి శ్రీహరి తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


👉 జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.


👉 హైదరాబాద్‌లోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.


👉 ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు.


👉 తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్‌తో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.


👉 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో, క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.


👉 ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణా రావు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) చైర్మన్ శివసేనా రెడ్డి , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , SATG ఎండీ ఎ. సోనీబాల దేవి పాల్గొన్నారు.