👉 ప్రభుత్వం–ప్రజలకు వారధిగా వార్తాపత్రికలు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమాజాన్ని చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో వార్తాపత్రికల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజల గొంతుకగా నిలిచే పత్రికలు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రముఖ దినపత్రిక నినాదం 23వ వార్షికోత్సవ వేడుకలకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
గత 23 ఏళ్లుగా ప్రజలకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావడంలో ఆ పత్రిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
👉 ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ కీలకం
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు, బాధ్యతాయుతమైన జర్నలిజానికి ప్రత్యేక స్థానం ఉందని మంత్రి పేర్కొన్నారు.
👉 ప్రజల సమస్యలను కేవలం వార్తలుగా కాకుండా.. వాటి పరిష్కారానికి దిశానిర్దేశం చేసే సామాజిక బాధ్యతతో మీడియా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

👉 ప్రజల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వాల ముందుకు తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా పాలనా వ్యవస్థను మరింత జవాబుదారీగా మార్చగల శక్తి మీడియాకు ఉందని అన్నారు.
👉 23 ఏళ్ల ప్రజాసేవకు అభినందనలు !

23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దినపత్రిక యాజమాన్యంతో పాటు పాత్రికేయులు, సిబ్బందికి మంత్రి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లోనూ మరింత ఉన్నత ప్రమాణాలతో జర్నలిజాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ప్రజల పక్షాన నిలిచే మీడియా.. ప్రజాస్వామ్యానికి బలమైన గొంతుకగా మారుతుందన్న సందేశాన్ని మంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
